జగన్ కు జోగయ్య మరో లేఖ… జీవితకాలం లేటంటున్న జనం!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డికి మాజీ మంత్రి, కాపు నేత చేగొండి హరిరామజోగయ్య మరోలేఖ రాశారు. ఇందులో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్‌ నియామకం విషయాన్ని ప్రస్థావించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కాపు, తెలగ, బలిజ ఒంటరి కులస్తులు జనాభాను తెరపైకి తీసుకువచ్చారు.. ఆ జనాభా ఓట్లు కావాలంటే వారికి పదవి ఇవ్వాలని తనదైన రాజకీయానికి తెరలేపారు!

ఏపీలో తిరుమల తిరుపతి దేవస్ధానం (టీటీడీ) బోర్డు ఛైర్మన్ గా ఉన్న వైవీ సుబ్బారెడ్డిని మార్చబోతోన్నారంటూ గతకొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ పదవి కోసం ఇప్పటికే వైసీపీలో ఉన్న పలువురు నేతలు పోటీ పడుతున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా ఎవరి పైరవీలు వారు చేశారని సమాచారం.

అయితే ఈ విషయంలో సీఎం జగన్ మాత్రం.. ఈసారి ఈ పదవి బీసీలకు ఇవ్వాలని భావించారని అంటున్నారు. అవును… అత్యంత ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి ఈసారి ఓ బీసీ నాయకుడికి ఇవ్వాలని జగన్ నిర్ణయించారని అంటున్నారు. ఇందులో భగంగా… వైసీపీ ఎమ్మెల్సీ, అసెంబ్లీ బీసీ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తిని ఆ పదవి వరించనుందని తెలుస్తోంది.

ఈ సమయంలో జగన్ నిర్ణయం తీసేసుకున్నారంటూ వార్తలు వస్తోన్న తరుణంలో హరిరామజోగయ్య స్పందించారు. టీటీడీ ఛైర్మన్ పదవిని కాపుల్లో ఉపకులమైన బలిజలకు ఇవ్వాలని సీఎం జగన్ కు రాసిన లేఖలో కోరారు. రాయలసీమలోని బలిజలకు ఈ పదవి ఇవ్వాలని ఆయన సూచించారు. ఇదే సమయంలో రాయలసీమలో కాపుల జనాభా 20 లక్షలు ఉందని.. భవిష్యత్తులో కాపు కులస్తుల సహకారం కావాలనుకుంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని జోగయ్య సీఎం జగన్ కు సూచించారు.

ఇదే క్రమంలో… రాష్ట్రంలో కాపులు, బలిజలు, తెలగ, ఒంటరి కులాల జనాభా 22 శాతంగా ఉన్న విషయాన్ని గుర్తిచేసిన జోగయ్య… మాజీ ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి నుంచి ఈరోజు వరకూ కాపుల్ని వాడుకోవడం తప్ప కనీసం రిజర్వేషన్ సౌకర్యం కూడా కలుగజేయలేదని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా తాను గతంలో మంత్రిగా పనిచేసిన విషయాన్ని మరిచినట్లున్నారు!

అయితే టీడీపీ చైర్మన్ గా బీసీ సామాజికవర్గానికి చెందిన నేతను ఎంపిక చేస్తున్నారని, ఆయన పేరుతో సహా మీడియాలో కథనాలు వచ్చిన సుమారు వారం రోజుల తర్వాత జోగయ్య ఈ లేఖ రాయడం గమనార్హం. దీంతో ఈ లేఖలో బలిజలపైనా, కాపు ఉప కులాలపైనా ఆయనకు చిత్తశుద్ధి ఉండటం కంటే… ఈ విషయంలో జగన్ ను రాజకీయంగా ఇరుకున పెట్టాలనే ఉద్దేశ్యమే స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు ఆ సామాజికవర్గ ప్రజాలు.

కాగా… ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నంత కలం పార్టీలు మారడంతోనే బిజీగా గడిపేశారని చేగొండి హరిరామ జోగయ్య గురించి బాగా తెలిసిన వారు చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంల్ ఆయన రాజకీయ కెరీర్ ను ఒకసారి గుర్తు చేస్తున్నారు. నాడు ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రిగా ఉన్న సమయంలో కాపు రిజర్వేషన్స్ గురించి ప్రస్థావించి చేయించుకుని ఉన్నా, కనీసం ప్రయత్నించి ఉన్నా ఆయన చిత్తశుద్ధి కనిపించేదని అంటున్నారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి 2004లో లోక్ సభకు ఎన్నికయిన జోగయ్య… అనంతరం ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత టీడీపీలో చేరారు. ఆ సమయంలో నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఎన్టీఆర్ కేబినెట్ లో హోమంత్రిగా పనిచేశారు. వైఎస్ హయాంలో మరళా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో 2008 కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా చేసి చిరంజీవి ప్రారంభించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు.

ఆ తర్వతా జగన్ పార్టీ వైసీపీలో జాయిన్ అయ్యారు. 2014 లో జనసేన స్థాపించిన సమయంలో వైసీపీకి రాజినామా చేశారు. అయితే జనసేనలో ఈయన చేరలేదో.. పవన్ చేర్చుకోలేదో తెలియదు కానీ… ప్రస్తుతం లేఖలు రాస్తూ… జనసేనకు అనధికారిక రాజకీయ సలహాదారుడిగా పనిచేసుకుంటూ కాలం గడుపుతున్నారు.