ఏపీలో రానున్న ఎన్నికల్లో టీడీపీ – బీజేపీ లతో కలిసి జనసేన బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో రెండు చోట్లా ఓడిపోయిన పవన్.. ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ అసెంబ్లీ గేటు తాకాలని బలంగా ఫిక్సయ్యారని అంటున్నారు. ఈ నేపథ్యంలో జనసేన కనీసం 60 అసెంబ్లీ సీట్లలో పోటీ చేయాలని.. అధికారంలో వాటాగా రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పదవిని తీసుకోవాలని హరిరామజోగయ్య.. పవన్ కు సూచిస్తూ లేఖలు రాసిన సంగతి తెలిసిందే.
అక్కడితో ఆగని ఆయన… రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాల పేర్లు, వాటిలో పోటీ చేసే అభ్యర్థులను సైతం సూచిస్తూ జోగయ్య పలుమార్లు పవన్ కల్యాణ్ కు లేఖలు రాశారు. అయితే పవన్ 24 అసెంబ్లీ సీట్లకు, 3 పార్లమెంటు సీట్లకే పరిమితమయ్యారు. అనంతరం కూటమిలోకి బీజేపీ కూడా వచ్చి చేరడంతో… ఆ 24 కాస్తా 21, 3 లోక్ సభ కాస్తా 2 కి పడిపోయిన పరిస్థితి. దీంతో.. ఈ విషయంపై జోగయ్య హర్ట్ అయిపోయారు.
ఇలా 21 స్థానాలకు జనసేన పరిమితం అవ్వడంపై రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీలోనూ, ఆ పార్టీని అభిమానించే వారిలోనూ తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. పవన్ తీసుకున్న సీట్లపై అంతా పెదవి విరిచారు. చంద్రబాబు.. పవన్ ని మోసం చేస్తున్నాడా.. లేక పవన్ కల్యాణ్.. చంద్రబాబు పల్లకి మోయడానికే పార్టీ పెట్టాడా అంటూ ధ్వజమెత్తారు. అయితే ఈ విషయాలపై పవన్ అందరికీ కౌంటర్ ఇచ్చారు. తనకు సలహాలు ఇచ్చేవారు వద్దని.. తాను చెప్పింది వినేవారు మాత్రమే కావాలంటూ తేల్చిచెప్పారు.
ఆ తదనంతర పరిణామాల్లో హరిరామ జోగయ్య కుమారుడు వైసీపీలో చేరిపోయారు. ఇదే క్రమంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా వైసీపీ కండువా కప్పుకుని, పిఠాపురంలో టార్గెట్ పవన్ ఆపరేషన్ లో బిజీగా ఉన్నారు! ఈ నేపథ్యంలో తాను మాత్రం జనసేనను వీడనంటూ.. వైసీపీని ఓడించడమే ధ్యేయంగా పనిచేయాలని పిలుపునిచ్చారు జోగయ్య. ఈ సమయంలో 25 మంది సభ్యులతో కాపు బలిజ సంక్షేమ సేన నూతన కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. కాపులు, బలిజల సంక్షేమంతోపాటు ఇతర బలహీన వర్గాల వారి సాధికారత కోసం పాటుపడతామని ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ సందర్భంగా… ఈ వర్గాలు ఏదో ఒక రోజు అధికారంలోకి వచ్చేలా, పవన్ కళ్యాణ్ రాష్ట్ర పగ్గాలు చేపట్టేలా కృషి చేస్తామని చెప్పిన జోగయ్య… ఆయా వర్గాలు, ఇతర బలహీనవర్గాల మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యే సత్తా పవన్ కు ఉందని తాను బలంగా నమ్ముతున్నానని అన్నారు. ఇదే క్రమంలో పిఠాపురంలో పవన్.. రాష్ట్రంలో కూటమి గెలుపుకోసం తమ వంతు కృషి చేస్తామని హరిరామజోగయ్య వెల్లడించారు. అనంతరం మేనిఫెస్టోపై స్పందించారు.
ఇందులో భాగంగా… ప్రత్యేకంగా కాపుల సంక్షేమ కోసం ఏమి చేస్తారు, ఎలా చేస్తారు అనే విషయాలను మేనిఫెస్టోలో ప్రకటించాలని జోగయ్య డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల టీడీపీ – జనసేన బీసీ డిక్లరేషన్ ప్రకటించిన సమయంలో కూడా.. కాపు డిక్లరేషన్ కూడా ప్రకటించాలంటూ జోగయ్య డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. మరి టీడీపీ – జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో జోగయ్య కోరిక మేరకు.. కాపుల కోసం పవన్ ఎలాంటి ప్రత్యేక పథకాలు తెస్తారనేది వేచి చూడాలి!!