బాబుకు డీహైడ్రేషన్… గుడివాడ వెటకారం అలా ఉంది!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో నంద్యాలలో చంద్రబాబు అరెస్టైనప్పటినుంచీ టీడీపీ నుంచి వస్తున్న వివరణ, వాదనా.. కేసు గురించి తప్ప మిగిలిన అన్ని విషయాల గురించీ ఉందనే మాటలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మరిముఖ్యంగా జైల్లో దోమలున్నాయి, ఉక్కబోస్తుంది, వేడి నీళ్లు లేవు వంటికామెంట్లు అత్యంత కీలకం! దీంతో… వైసీపీ నేతలు చంద్రబాబుపై వెటకారం డోసు పెంచేస్తున్నారు.

ఆ సంగతి అలా ఉంటే… స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో స్కాం జరిగిందా లేదా.. సీమన్స్ కంపెనీతో ఒప్పందం నిజమా అబద్దమా.. అంటూ సూటిగా ప్రశ్నిస్తుంది వైసీపీ. అయితే బాబుతో ములాకత్ అనంతరం అటునుంచి వస్తున్న సమాదానాలు… వేడిగా ఉంది, వేడి నీళ్లు కావాలి, దోమలు కుడుతున్నాయి, ఏసీ లేకుండా ఎలా అనే ప్రశ్నలు మాత్రమే కావడం గమనార్హం.

అయితే ఇదంతా సింపతీ డ్రామా అని… జైల్లో ఉన్నప్పుడు అందరు ఖైదీలకూ ఎలాంటి సదుపాయాలు, మరెలాంటి అసౌకర్యాలు ఉంటాయో చంద్రబాబుకి కూడా అలాంటివే ఉంటాయని చెబుతున్నారు. ఇక కొడాలినాని అయితే తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. జైలులో దోమలు కుట్టక.. రంభ, ఊర్వశి, మేనకా వచ్చి కన్ను కొడతారా అని ఎదురు ప్రశ్నించారు!

ఈ సమయంలో ఇంట్లో దొరికే అన్ని సదుపాయాలు, సౌకర్యాలు కావాలనుకుంటే… ఇలాంటి తప్పుడు పనులు చేయకూడదని, ఫలితంగా జైలు రావాల్సిన అప్రిస్థితి తెచ్చుకోకూడదని వైసీపీ నేతలు హితవు పలుకుతున్నారు. కాగా… చంద్రబాబుకు ఇంటి భోజనం, మెడిసిన్స్ అందుతున్న సంగతి తెలిసిందే.

ఈ సమయంలో బాబుకు జైల్లో అసౌకర్యంగా ఉందంటూ తాజాగా భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలపై మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. మంత్రి పదవి చేపట్టినప్పటినుంచీ విపక్షాలపై విరుచుకుపడే విషయంలో ఫాం కంటిన్యూ చేస్తున్న అమర్నాథ్.. మరోసారి స్పందించారు. ఇందులో భాగంగా సీఐడీ విచారణ తర్వాత నారా లోకేష్ సెల్ఫ్ సర్టిఫైడ్ మేథావిలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

ఇదే క్రమంలో… దొంగతనం చేసిన వాళ్లు వెంటనే నిజం చెప్పరని చెబుతున్న అమర్నాథ్… సీఐడీ వేసే ప్రశ్నలు అమరావతి భూముల స్కాం గురించే ఉంటాయి కానీ, లోకేష్ కుటుంబం యోగక్షేమాలు గురించి కాదని ఎద్దేవా చేశారు. ఇక, మేథావిలా మాట్లాడినంత మాత్రాన చేసిన తప్పు నుంచి తప్పించుకోలేరని హితవు పలికిన మంత్రి… చంద్రబాబుతోపాటు లోకేష్ కి కూడా శిక్ష పడడం ఖాయమని జోస్యం చెప్పారు.

ఇక జైల్లో చంద్రబాబు అసౌకర్యాల గురించి భువనేశ్వరి చేస్తున్న వాదనలో ముఖ్యంగా డీహైడ్రేషన్ వార్తలపై కూడా అదే స్థాయిలో స్పందించిన గుడివాడ… రాజమండ్రి జైలు వెల్ నెస్ సెంటర్ కాదని గుర్తుచేస్తున్నారు. ప్రస్తుతం ఈ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.