గ్రూప్ 2 పై టిఎస్ పీఎస్సీ ముందు ధర్నా, ఉద్రిక్త పరిస్థితి

గ్రూపు 2 ఇంటర్వ్యూ షెడ్యూల్ ను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గ్రూప్ 2 అభ్యర్దులు టిఎస్ పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. టిఎస్ పీఎస్సీ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఇంటర్వూ షెడ్యూల్ ప్రకటించి తమకు న్యాయం చేయాలని వారు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

2016 నవంబర్ 11, 13 వ తేదిలలో గ్రూప్ 2 పరీక్షను నిర్వహించారు. గ్రూప్ 2 నియామకాల ప్రక్రియ కోసం రెండేళ్లుగా ఎదురు చూస్తున్నామన్నారు. ఇంతకాలం హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉందని , గ్రూప్ 2 ప్రక్రియ వెంటనే నిర్వహించాని హైకోర్టు తీర్పు ఇచ్చి కూడా నెల రోజులు దాటిందని వారు గుర్తు చేశారు. అయినా ఇప్పటి వరకు టిఎస్ పీఎస్సీ అధికారులు ఏర్పాట్లు చేయకపోవడం సమంజసం కాదని వారన్నారు. నియామకాల ప్రక్రియ పూర్తి కాకపోవడంతో మానసిక వేదనకు గురవుతున్నామన్నారు.

చంటి పిల్లను ఎత్తుకొని ధర్నాకు ఓ మహిళా అభ్యర్ధి రావడం సమస్య తీవ్రతకు అద్దం  పట్టింది. గజ్వేల్ నుంచి వచ్చిన శ్రీవాణి మాట్లాడుతూ గ్రూప్ 2 మీద అందరికి ఎన్నో ఆశలు ఉన్నాయని కోర్టు తీర్పు చెప్పిన తర్వాత కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని ఆమె విమర్శించారు. నోటిఫికేషన్ ద్వారా నియామకాలు చేపట్టేందుకు మూడేండ్ల సమయం పడుతుందా అని ప్రశ్నించారు. తమది మధ్య తరగతి కుటుంబాలని, సమస్య తీవ్రతను అర్ధం చేసుకొని మానవతా ధృక్పధంతో ఇంటర్వూ షెడ్యూల్ ను ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళన కారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు బేగం బజార్ స్టేషన్ కు తరలించారు.

గ్రూప్ 2 లో కొంతమంది వైట్ నర్ ఉపయోగించి సమాధానాలు పెట్టారనే  దాని పై కొంత మంది హైకోర్టులో పిటిషన్ వేయడంతో  కేసు పూర్వా పరాలు పరిశీలించిన కోర్టు వారిని అనుమతించవద్దని తీర్పు చెప్పింది. వెంటనే మిగతా ప్రాసెస్ చేయాలని ఆదేశాలిచ్చింది. అయినా కూడా టిఎస్ పీఎస్సీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని వారు మండిపడ్డారు. తమ ఆవేదనను అర్ధం చేసుకొని వెంటనే నియామక ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.

వేరే పనులు చేయలేక గ్రూప్ 2 పైనే నమ్మకంతో కండ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్నామన్నారు. వేలకు వేలు పెట్టి కోచింగ్ లు తీసుకొని అహర్నిషలు శ్రమించి కష్టపడి చదివి పరీక్షలు రాస్తే టిఎస్ పీఎస్సీ తమ బాధను కనీసం అర్ధం చేసుకోకుండా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. టిఎస్ పీఎస్సీ కాల్ సెంటర్ కు ఫోన్ చేసినా కూడా సరైన సమాధానాలు రాలేదన్నారు.

ఇటీవల ఓ అభ్యర్ధి టిఎస్ పీఎస్సీకి ఫోన్ చేసి నిర్లక్ష్యం పై ప్రశ్నించిన ఫోన్ కాల్ సంభాషణ కింద ఉంది వినండి.  దాదాపు అరగంట పాటు ఫోన్ కాల్ సంభాషణ ఉంది.