టిడిపి అధినేత, ఎపి సిఎం చంద్రబాబు నాయుడుకు గ్రేట్ రిలీఫ్ దొరికింది. గత నెలరోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిన విషయంలో చంద్రబాబుకు ఊరట లభించింది. ఆ వివరాలు చదవండి.
మహారాష్ట్రలో వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చంద్రబాబు గతంలో ఆందోళన చేశారు. ఆ సమయంలో చలో బాబ్లీ ప్రాజెక్టుకు టిడిపి పిలుపునిచ్చింది. ఆ సమయంలో చంద్రబాబు సహా పార్టీ నేతలంతా బాబ్లీ పర్యటనకు వెళ్లారు. అక్కడ ధర్నా చేశారు. అక్రమంగా బాబ్లీ ప్రాజెక్టు పరిసరాల్లోకి చొరబడ్డారని అప్పట్లో మహారాష్ట్ర సర్కారు బాబు సహా టిడిపి నేతలపై కేసులు నమోదు చేసింది.
ఆ కేసుల్లో బాబు సహా టిడిపి నేతలు వాయిదాలకు హాజరు కావడంలేదు. దీంతో గత నెల రోజుల క్రితం చంద్రబాబుకు ధర్మాబాద్ న్యాయస్థానం నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ అయింది. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనం రేపింది. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించి చంద్రబాబుకు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయించారని టిడిపి అగ్గి మీద గుగ్గిలమైంది.
అయితే చంద్రబాబు తరుపున ధర్మాబాద్ కోర్టులో అడ్వొకెట్స్ రీకాల్ పిటిషన్ వేశారు. గంటన్నరపాటు వాదనలు సాగాయి. ఈ సందర్భంగా చంద్రబాబుకు వ్యక్తిగతంగా హాజరు కావాలన్న ఆదేశాలను ఉపసంహరించాలని బాబు తరుపు న్యాయవాది సిద్ధార్థ్ లోత్రా కోరారు. సిద్ధార్థ్ లోత్రా సుప్రీంకోర్టులో పేరున్న న్యాయవాది. బాబు తరుపు న్యాయవాదుల విన్నపాన్ని మన్నించిన న్యాయస్థానం బాబు వ్యక్తిగతంగా హాజరుకావాలన్న ఆదేశాలను ఉపసహరించింది.
దీంతో ఈనెల 15న వ్యక్తిగతంగా చంద్రబాబు ధర్మాబాద్ కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం లేదని తేల్చింది కోర్టు. చంద్రబాబుకు పెద్ద ఊరట లభించింది.