ఆంధ్రప్రదేశ్ లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా పోస్టులు పెట్టే ఫ్యాషన్ ఈ మధ్యన ఎక్కువైంది. ఎక్కడో ఏదో జరిగితే.. దానికి ఉన్నవి.. లేనివి కలిపేయటం.. మనసులో ఉన్న పైత్యాన్ని రంగరించి ఇష్టారాజ్యంగా ఆరోపణలు చేస్తూ.. నిజానిజాల్ని పట్టించుకోకుండా పోస్టులు పెట్టేసే తీరుతో విషయాలు మరింతగా ముదురుతున్నాయి. ఇలాంటివాటికి చెక్ పెట్టే పనిలో పడ్డారు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్.
ఇటీవల కాలంలో ఏపీలో చోటు చేసుకుంటున్న పలు పరిణామాలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారటమే కాదు.. పలు సందర్భాల్లో చేయని తప్పునకు వేలెత్తి చూపించుకోవాల్సిన పరిస్థితి చోటు చేసుకుంటుంది. ఎక్కడో ఏదో జరిగినా.. దానికి దురుద్దేశాలు ఆపాదిస్తూ సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారానికి చెక్ పెట్టాలని ఏపీ పోలీస్ బాస్ భావిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చేశారు.
సోషల్ మీడియాలో అదే పనిగా రెచ్చగొట్టే పోస్టులు పెట్టటం.. ఉద్దేశ పూర్వకంగా తప్పుదారి పట్టించే పోస్టులపై సీరియస్ చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇలాంటి వాటిపై కఠిన చర్యలు సిద్ధమని ప్రకటించారు. సోషల్ మీడియాలో వచ్చిన సమాచారంలో వాస్తవం ఎంత? నిజానిజాల మాటేమిటి? అన్న విషయాల్ని చెక్ చేసుకున్న తర్వాతే పోస్టులు పెట్టాలని.. ఫార్వర్డ్ చేయాలని సూచన చేస్తున్నారు. ఈ విషయంలో జరిగే తప్పుల్ని తాము ఉపేక్షించమని.. కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు.
తాజాగా గుంటూరు జిల్లా నరసరావుపేటలో విగ్రహాలు ధ్వంసమైనట్లుగా ప్రచారం జరిగిందని.. ఆ విషయాన్ని సరిగా చెక్ చేసుకోకుండా కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్నారు. అయితే.. నరసరావుపేటలో విగ్రహాల ధ్వంసం పేరుతో జరుగుతున్న ప్రచారం అసత్యమని తేల్చారు. కులాల మధ్య.. మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని.. అలాంటి వారి ఉచ్చులో పడొద్దని ఆయన హితవు పలుకుతున్నారు. ఇకనుండి ఆచి తూచి పోస్ట్లు పెట్టాలండి బాబు, లేదంటే దూల తీరిపోతది…జాగ్రత్త!