టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పై వల్లే టీడీపీ సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరికి తిరిగి రాజమండ్రి రూరల్ సీటు దక్కకుండా నారా చంద్రబాబు నాయుడు ప్లాన్ వేశారా? రాజమండ్రి రూరల్ నియోజకవర్గ అభ్యర్థిగా కందుల దుర్గేష్ పేరును పవన్ కల్యాణ్ ప్రకటించడం వెనుక ఉన్న స్కెచ్ ఇదేనా? ప్రస్తుతం అటు పార్టీలోనూ, ఇటు గోదావరి జిల్లాల్లోనూ ఇదే చర్చ బలంగా జరుగుతుంది.
వాస్తవానికి పొత్తులో భాగంగా కుప్పం, మంగళగిరి, టెక్కలి, హిందూపుర్ మొదలైన స్థానాలు జనసేనకు ఇస్తారా? అదెంత అసాధ్యమో… రాజమండ్రి రూరల్ కూడా అలా అనే భావించాలి. కారణం… బుచ్చయ్య చౌదరి ఈనాటి వ్యక్తికాదు! టీడీపీకి బుచ్చయ్య చౌదరితో ఉన్న అనుబంధం నేటిది కాదు!
1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన సమయంలో ఆ పార్టీలో చేరిన ఫస్ట్ బ్యాచ్ లో బుచ్చయ్య సోదరుడు రాజేంద్రప్రసాద్ ఒకరు. ఈ సమయంలో సోదరుడు ప్రోద్బలంతో ఎన్టీఆర్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు బుచ్చయ్య. అంటే… టీడీపీ పునాదుల నుంచి ఆయన ఆ పార్టీలో ఉన్నారన్నమాట. అనంతరం… గోదావరి జిల్లాల్లో పార్టీ కన్వీనర్ గా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతానికి కృషి చేశారు.
ఈ క్రమంలో ఎన్నో బాధ్యతలు, మరెన్నో పదవులు, పార్టీకి ఎన్నో సేవలు చేసిన ఆయన ఇప్పటికి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 జగన్ వేవ్ లో సైతం రాజమండ్రి రూరల్ లో ఫ్యాన్ తిరగకుండా ఆపగలిగారు. గెలిచిన 23 మందిలో ఒకరుగా నిలిచారు. అలాంటి బుచ్చయ్యకు రాజమండ్రి రూరల్ టిక్కెట్ దూరం అవుతుందని అంటున్నారు.. మరో సీటును చంద్రబాబు కేటాయిస్తారనే నమ్మకం కూడా లేదని చెబుతున్నారు.
అయితే బుచ్చయ్యను చంద్రబాబు ఇప్పటి వరకూ మంత్రిగా చేయకపోవడానికి.. ఇప్పుడు టిక్కెట్ కూడా ఇవ్వకుండా ప్లాన్స్ చేయడానికి రెండు ప్రధాన కారణాలు చెబుతున్నారు పరిశీలకులు! ఇందులో భాగంగా 1995లో ఎన్టీఆర్ గద్దె దింపడంతో చంద్రబాబుకు వ్యతిరేకంగా పెద్దాయన పక్షాన పోరాటం చేసి, ఆయన మరణం వరకు ఆయనతోనే నడిచారు బుచ్చయ్య! ఇది ఒక కారణం అని చెబుతున్నారు.
ఇదే సమయంలో… తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్థావన లేకుండా, రాకుండా చేయాలని చంద్రబాబు చాలాకాలంగా విశ్వప్రయత్నాలు చేస్తున్నారనే చర్చ నడుస్తున్న సమయంలో… టీడీపీ పుంజుకోవాలంటే జూనియర్ ఎన్టీఆర్ రావాలని బుచ్చయ్య చౌదరి అన్నారు. ఇదే క్రమంలో… పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ ను ఆహ్వానించాలని కూడా చంద్రబాబుకు సూచించారు.
దీంతో… నాడు సీనియర్ ఎన్టీఆర్ వెంట ఉండటం, నేడు జూనియర్ ఎన్టీఆర్ కి టీడీపీ బాధ్యతలు అప్పగిస్తే పూర్వ వైభవం వస్తుందన్నట్లుగా వ్యాఖ్యానించడం వంటివే… చాలా మంది జూనియర్ల సీట్లను సైతం కాపాడుతూ, సీనియర్ మోస్ట్ అయిన బుచ్చయ్య చౌదరి సీటును మాత్రం జనసేనకు సమర్పించడం వెనుక గల బలమైన కారణాలనే కామెంట్లు వినిపిస్తున్నాయి! అయితే… బుచ్చయ్య మాత్రం తనకే టిక్కెట్ అనే ఆశతో ఉండటం గమనార్హం!