ఎట్టకేలకు జనసేనకు గాజు గ్లాసు ఫిక్సయ్యింది.!

ఎలాగైతేనేం, జనసేన పార్టీకి పెద్ద ఊరట లభించింది. గాజు గ్లాసు గుర్తుతోనే ఎన్నికల్లో పోటీ చేయనున్నారు జనసేన అభ్యర్థులు. మొత్తం, 175 నియోజకవర్గాల్లోనూ జనసేన పార్టీకి గాజు గ్లాసుని కేటాయిస్తూ, కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జనసేన పార్టీ లీగల్ విభాగానికి, కేంద్ర ఎన్నికల సంఘం సమాచారం పంపింది.

సో, ఎన్నికల గుర్తు విషయమై జనసేన పార్టీకి టెన్షన్ తీరినట్లే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ జనసేన పార్టీ అభ్యర్థులు గాజు గ్లాసు గుర్తు మీదనే పోటీ చేసిన సంగతి తెలిసిందే.

కాగా, ఆంధ్ర ప్రదేశ్‌లో జనసేన పార్టీకి కామన్ సింబల్ ఇవ్వవద్దంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది అధికార వైసీపీ. ఈ వ్యవహారం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది కూడా. గతంలో బీజేపీతో, ఇప్పుడు టీడీపీతో కలిసి పోటీ చేస్తున్న జనసేన పార్టీకి కామన్ సింబల్ ఎలా ఇస్తారని కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి నిలదీశారు.

అయితే, గాజు గ్లాసు గుర్తు విషయమై ఇతరులు లేవనెత్తుతున్న అభ్యంతరాల నేపథ్యంలో, జనసేన లీగల్ టీమ్ యాక్టివ్‌గా వ్యవహరించింది. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా, జనసేన పార్టీ ఎట్టకేలకు గాజు గ్లాసు గుర్తునే కామన్ సింబల్‌గా పొందింది.

అంతా బాగానే వుందిగానీ, జనసేన పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది.? జనసేన పోటీ చేయని చోట్ల గాజు గ్లాసు ఎవరికైనా కేటాయిస్తారా.? వంటి ప్రశ్నల చుట్టూ కన్‌ఫ్యూజన్ అయితే అలాగే కొనసాగుతోంది.