2019 ఎన్నికల సమయంలో ఏపీ రాజకీయాల్లో “పసుము – కుంకుమ” పథకం ఎంత ఫేమస్ అనేది తెలిసిన విషయమే. నాడు సరిగ్గా ఎన్నికల సమయంలో చంద్రబాబు చేసిన పొలిటికల్ జిమ్మిక్కుగా పలువురు ఈ పథకంపై స్పందించారు. ఫలితాలు వచ్చిన అనంతరం దాన్ని ప్రజలు కూడా నిజం అని అనుకున్నారని కన్ ఫాం అయ్యిందనే కామెంట్లు వినిపించాయి. ఈ క్రమంలో విశాఖలో ఇప్పుడు గంటా శ్రీనివాస రావు అలాంటి పథకం ఒకటి సొంతంగా అమలుచేస్తున్నారనే చర్చ తెరపైకి వచ్చింది.
వాస్తవానికి విశాఖ రాజకీయాల్లో గంటా వైఖరి విభిన్నంగా ఉంటుందని అంటుంటారు. పైగా ఆయన రెగ్యులర్ గా నియోజకవర్గాలు మారుస్తుంటారనే పేరు కూడా ఉంది! ఈ క్రమంలో ఈ ఎన్నికల్లో గంటాను చీపురుపల్లి నియోజకవర్గం నుంచి బొత్సాకు పోటీగా నిలబెట్టాలని చంద్రబాబు ప్లాన్ చేశారు. అయితే అందుకు గంటా ఏమాత్రం సుముఖత వ్యక్తం చేయలేదని అంటున్నారు. పైగా… బాబు ఇచ్చిన ఆప్షన్ పై గంటా అలిగారని.. అవసరమైతే రెబల్ గా బరిలోకి దిగే అవకాశాలను కొట్టిపారేయలేమనే చర్చ నడిచింది.
ఈ సమయంలో ఆ చర్చకు బలం చేకూర్చే పని గంటా అనుచరులు భీమిలి కేంద్రంగా చేస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం విశాఖ ఉత్తర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గంటా… ఈసారి భీమిలి నుంచి పోటీచేయాలని భావిస్తున్నారు. అయితే… టీడీపీ చేయించిన సర్వేలో చీపురుపల్లిలో గంటా గెలుపుపక్కా అనే ఫలితాలు వచ్చాయని చెబుతుండగా.. తాను చేయించుకున్న సర్వేల్లో మాత్రం వ్యతిరేక ఫలితాలు వచ్చాయని గంటా చెబుతున్నారంట.
దీంతో… చీపురుపల్లికి వెళ్లే విషయంలో గంటా ఏమాత్రం సానుకూలంగా లేరని అంటున్నారు. పైగా ఎన్నికల షెడ్యూల్ కు సమయం దగ్గరపడుతున్న వేళ ఇప్పటికీ ఆయన నియోజకవర్గంపై స్పష్టత రావడం లేదు. దీంతో… భీమిలిలో గంటా ఇంటింటికీ గిఫ్ట్ లు పంచుతున్నారని తెలుస్తుంది. చీర, సారే, పసుపు కుంకుమలతో గంటా అనుచరులు భీమిలిలో ఇంటింటికీ గిఫ్ట్ లు పంచుతున్నారనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఇలా తన పోటీపై అధిష్టాణం నుంచి కన్ ఫర్మేషన్ రాకపోయినా కూడా భీమిలి నియోజకవర్గంలో గంటా అనుచరులు వెయ్యి రూపాయలు విలువచేసే సుమారు 50వేల బహుమతులు సిద్ధం చేసి, పంపకాలు కూడా మొదలుపెట్టడంతో అసలు గంటా మనసులో ఏముందనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. దీంతో… చంద్రబాబు తనకు భీమిలి టిక్కెట్ ఇస్తే సరేసరి… కానిపక్షంలో ఓడినా, గెలిచినా విశాఖను వదిలి తాను మరో చోటికి వెళ్లకూడదని గంటా భావిస్తున్నారని.. ఆయన అనుచరుల అభిప్రాయం కూడా ఇలానే ఉందని అంటున్నారు.
దీంతో… గంటా శ్రీనివాసరావు విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇందులో భాగంగా గంటా పట్టుదలకు అంగీకరించి భీమిలీ టిక్కెట్ ఆయనకే కేటాయిస్తారా.. లేక, గంటాను వదులుకునేందుకైనా వెనకాడరా అనేది వేచి చూడాలి!! మరి గంటా చేపట్టిన ఈ పసుపు కుంకుమ పథకం ఎలాంటి పరిణామాలకు, ఇంకెలాంటి ఫలితాలకు కారణం అవ్వబోతోందనేది వేచి చూడాలి!