టీడీపీని ఇరికించేసిన గంటా… పెద్దమ్మకు అర్ధమవుతోందా?

సాధారణంగా పార్టీ వ్యూహాలకు, తీసుకునే నిర్ణయాలకు సంబంధించి ఆ నేతలు చేసే వ్యాఖ్యలు, ఇచ్చే స్టేట్ మెంట్ల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందనేది తెలిసిన విషయమే. తర్వాత నాలుక కరుచుకుని, మాట మార్చి, తూచ్ అన్నా ప్రయోజనం ఉండదు. ఈ క్రమంలో తాజాగా టీడీపీ పొత్తులపై గంటా శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవి టీడీపీని ఇరికించేవే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

రాబోయే ఎన్నికల్లో టీడీపీ పొత్తులతో వెళ్తుందనేది తెలిసిన విషయమే. ఈసారి ఎన్నికల్లో ఒంటరిగా వెళ్తే వీరమరణమే అని జనసేన అనుభవ రాహిత్యం వల్ల బయటకు చెప్పుకుంటుంది.. టీడీపీ చెప్పుకోవడం లేదు అంతే తేడా అని కూడా అంటున్నారు. ఇప్పటికైతే వచ్చే ఎన్నికల్లో టీడీపీ – జన్సేన కలిసి వెళ్తాయనేది స్పష్టమైన విషయం. ఈ సమయంలో తమతో కలిసివచ్చే మరికొన్ని పార్టీల పేర్లు ప్రస్థావిస్తున్నారు గంటా.

ఇందులో భాగంగా… టీడీపీ జనసేన పొత్తులు కుదిరాయని చెబుతున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు.. ఈ పొత్తులలో సీపీఐ కూడా కలుస్తుంది అని కొత్త మాట చెప్పారు. ఇదే సమయంలో… బీజేపీ తమతో ఏ మేరకు కలసివస్తుందన్నది భవిష్యత్తు చెబుతుంది అని చెప్పుకొచ్చారు. అదేవిధంగా… ఏపీ రాజకీయాల మీద, పొత్తుల మీద బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది తప్ప ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ పురంధేశ్వరి కాదని చెప్పుకొచ్చారు.

అదంతా బాగానే ఉంది కానీ… టీడీపీ జనసేన కూటమిలోకి సీపీఐ రావడం ఏంటో గంటాయే చెప్పాలని అంటున్నారు పరిశీలకులు. ఇప్పటిదాకా టీడీపీ అధినాయకత్వం ఈ విషయంలో ఏమీ చెప్పడంలేదు. చంద్రబాబు మాత్రమే ఈ పొత్తులు ఎత్తుల గురించి అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. అలాంటిది గంటా మాజీ మంత్రిగా ఉంటూ అత్యంత కీలకమైన పొత్తుల విషయంలో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ.. బీజేపీకి దూరంగా జరుగుతోందని ఇండియా కూటమి నేతలతో టచ్ లో ఉంటోందని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. మరోపక్క అమిత్ షా ముందు పురందేశ్వరి, లోకేష్ లు ప్రత్యక్షమయ్యారు. ఇదే సమయంలో ఎన్ డీయే కూటమిలో ఉన్ననని కాసేపు, లేనని కాసేపు జనసేన అధినేత తనదైన రాజకీయ పరిజ్ఞానంతో చెప్పుకొస్తున్నారు.

ఈ సందిగ్ధ పరిస్థితుల్లో… టీడీపీ-జనసేన పొత్తులో సీపీఐ కూడా కలుస్తుందని గంటా శ్రీనివాస్ చెప్పడం అంటే… బీజేపీ కలవదని కన్ ఫాం చేయడమే అని అంటున్నారూ పరిశీలకులు. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించేవారిలో కమ్యునిస్టులు కూడా ఒకరు. ఆ సీపీఐ నేతలు టీడీపీ-జనసేన పొత్తులో ఉంటే.. ఇక బీజేపీ ఈ పొత్తుకు ప్రత్యర్థి అనే కదా అర్ధం!!

మరి ఈ విషయాలపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి. ప్రస్తుతానికి ఆమె బీజేపీ ఏపీ శాఖకు చీఫ్ గా ఉన్నారు కాబట్టి… టీడీపీ-జనసేన పొత్తులో సీపీఐ ఉంటుంది అని టీడీపీనేతలు చెబుతున్నారు కాబట్టి… ఇక ఈ కూటమికి బీజేపీ ప్రత్యర్థి అనేది ఫైనల్ అయినట్లే! మరి ఈ విషయం పురందేశ్వరికి అర్ధమవుతోందా.. లేక, బీజేపీ కంటే బందుత్వం ముఖ్యమని అర్ధమైనా అర్ధంకానట్లు ఉంటున్నారా అనంది వేచి చూడాలి!

ఏది ఏమైనా… స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పటిని నుంచి… పార్టీ పరిస్థితి రౌతు లేని గుర్రంలా అయిపోయింది అని అంటున్నారూ పరిశీలకులు. సరైన వ్యూహాలు లేవు సరికదా.. ఇలాంటి క్లిష్ట సమయంలో ఇలాంటి రిస్క్ స్టేట్ మెంట్స్ అవసరమా అనేది కూడా పరిశీలకులు ప్రశ్నగా ఉంది!