విజయలక్ష్మి లైంగిక ఆరోపణలపై కాంగ్రెస్ గండ్ర రియాక్షన్

స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు విజయలక్ష్మి అనే మహిళ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గండ్ర వెంకటరమణారెడ్డిపై లైంగిక ఆరోపణలు గుప్పంచారు. ఆమె ఏకంగా గండ్ర ఇంటి ముందే కూర్చుని ధర్నాకు దిగారు. ఈ ఘటన వరంగల్ సిటీలో సంచలనం రేపింది. గండ్ర రమణారెడ్డి తనతో నాలుగేళ్లుగా కాపురం చేస్తున్నారని విజయలక్ష్మి ఆరోపించారు. ఇప్పుడు తనెవరో తెలియదు అన్నట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. అయితే ఆమె ఆరోపణలపై గండ్ర రియాక్ట్ అయ్యారు. వరంగల్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.  విజయలక్ష్మి అనే మహిళ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు. తనను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మహిళ వెనుక ఉండి రాజకీయాలు చేయడం సరికాదన్నారు. తన రాజకీయ ప్రత్యర్థులు ఒక మహిళను అడ్డం పెట్టుకుని ఇలాంటి వ్యవహారాలకు పాల్పడడం అత్యంత దురదృష్టకరమన్నారు.

గతంలో టిఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ మీద కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయని గుర్తు చేశారు. అయినప్పటికీ బాల్క సుమన్ విషయంలో తాము సంయమనం పాటించామని, రాజకీయం చేయాలనుకోలేదని గుర్తు చేశారు. ఇప్పుడు మాత్రం తన ప్రత్యర్థులు ఇలాంటి చౌకబారు విమర్శలకు దిగడం బాధాకరమన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో తనకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి ఓర్వలేక ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఈ విషయంలో పోలీసులు నిస్పక్షపాతంగా విచారణ చేయాలని డిమాండ్ చేశారు. తాను ఏ విచారణకైనా సిద్ధమే అని ప్రకటించారు.

విజయలక్ష్మి స్వచ్ఛంద సంస్థ పేరుతో చాలా మందిని ఇబ్బంది పెట్టిన విషయం వరంగల్ పోలీసులకు తెలుసు అని చెప్పారు. మరిన్ని విషయాలను తదుపరి ప్రెస్ మీట్ లో చెబతానని గండ్ర మీడియా సమావేశం ముగించారు. గండ్ర రమణారెడ్డి గతంలో భూపాలపల్లి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో చీఫ్ విప్ గా పనిచేశారు. ప్రస్తుతం భూపాలపల్లి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రాష్ట్ర స్పీకర్ మధుసూదనాచారి ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గండ్ర రమణారెడ్డి వైఎస్ బతికి ఉన్న కాలంలో ఇప్పుడే తెలంగాణ వద్దు.. అభివృద్ధి చెందిన తర్వాతే తెలంగాణ కావాలని ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరిన టీం లో సభ్యులుగా ఉన్నారు. అయితే వైఎస్ మరణానంతరం గండ్ర తెలంగాణ కోసం ఔట్ రైట్ గా పనిచేశారని పేరుంది. కిరణ్ కుమార్ రెడ్డితో సన్నిహితంగా ఉన్నప్పటికీ తర్వాత కాలంలో తెలంగాణ కోసం గట్టిగానే ఫైట్ చేశారని చెబుతారు. తెలంగాణ వచ్చిన తర్వాత 2014లో గండ్ర ఓటమిపాలయ్యారు. ఈసారి ఎన్నికలు చాలారోజులునప్పటికీ నియోజకవర్గంలో సీరియస్ గానే పనిచేస్తూ పోతున్నారు. ఇప్పుడు ఈ ఉపద్రవం ముంచుకొచ్చింది గండ్రకు.

అయితే గండ్ర పై విజయలక్ష్మి చేసిన ఆరోపణల విషయంలో వెనక్కు తగ్గే అవకాశమే లేదని తేల్చి చెబుతున్నారు. గండ్ర వెంకటరమణారెడ్డితో తనకు శారీరక సంబంధం ఉన్నట్లు తన వద్ద వీడియోలు, ఫొటోలు కూడా ఉన్నాయంటూ ఆమె పెద్ద బాంబు పేల్చారు. అవసరమైతే వాటిని కూడా బయటపెడతానని హెచ్చరించారు. విజయలక్ష్మి ఆరోపణల పర్వం వరంగల్ జిల్లాలో సంచలనంగా మారింది. రాజకీయ వాతావరణం వేడెక్కింది. విజయలక్ష్మి గండ్ర నివాసం ముందు ధర్నా చేస్తూ ఏమన్నారో కింద వీడియోలో చూడండి.