గల్లా జయదేవ్ పేరు ఒకప్పుడు రాజకీయంగా, పారిశ్రామికంగా చర్చనీయాంశం కాగా, గత కొంతకాలంగా మౌనం వహించారు. టీడీపీ తరఫున గుంటూరు ఎంపీగా విజయం సాధించిన ఆయన, 2019 తర్వాత రాజకీయంగా పెద్దగా కనిపించలేదు. వైసీపీ ప్రభుత్వ హయంలో బిజినెస్ పరంగా కూడా పెద్దగా ప్రొజెక్టులు చేపట్టలేదన్న అభిప్రాయం ఉంది. కానీ ఇప్పుడు, ఏపీలో టీడీపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడ్డాక, ఆయన మళ్లీ యాక్టివ్ అయ్యారు.
తాజాగా గల్లా జయదేవ్ దావోస్ వేదికగా జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశాల్లో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడులతో కలిసి ఆయన కూడా ఆ సమావేశాల్లో ప్రత్యక్షమయ్యారు. ఈ హాజరు, టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆయన రీ-ఎంట్రీ గ్రాండ్‌గా జరుగుతుందనిపించేలా చేసింది. రాజకీయంగా కాకపోయినా, పారిశ్రామికంగా గల్లా జయదేవ్ మళ్లీ ఫోకస్ చేస్తూనే ఉన్నారనే సంకేతాలు అందాయి.
ఈ నేపథ్యంలో, అమరరాజా గ్రూప్‌కు చెందిన అమరరాజా ఇన్‌ఫ్రా కంపెనీకి భారీ ప్రాజెక్టు దక్కింది. శ్రీ సత్యసాయి జిల్లాలో 300 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి సెకీ (సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) నుంచి గల్లా జయదేవ్ కంపెనీ టెండర్ గెలుచుకుంది. 1,100 ఎకరాల విస్తీర్ణంలో సుమారు ఏడాదిలోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని డీల్ కుదిరినట్లు తెలుస్తోంది.
ఈ ప్రాజెక్టుతో గల్లా జయదేవ్ మళ్లీ తన పారిశ్రామిక రంగంలో తన స్థానం నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటివరకు ప్రాజెక్ట్ ఖర్చు ఎంత అన్న వివరాలు బయటకు రాకపోయినా, కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థ ఈ ప్రాజెక్ట్‌ను అమరరాజాకు అప్పగించడమే కీలక పరిణామంగా మారింది. ఇది గల్లా జయదేవ్‌కు మాత్రమే కాదు, టీడీపీ పాలనలో వ్యాపారవేత్తలకు మెరుగైన అవకాశాలు లభిస్తున్నాయనే సంకేతాన్ని కూడా ఇస్తోంది.