నారా లోకేష్ పాదయాత్ర వల్ల రాబోయే ఎన్నికల్లో టీడీపీ పార్టీకి ఓట్ల రూపంలో కలిగే ఉపయోగం ఎంతో తెలియదు కానీ… పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలు, అసంతృప్తుల వ్యవహారాలు తెరపైకి తెస్తున్నారని మాత్రం అంటున్నారు పరిశీలకులు. ఇందులో భాగంగా తాజాగా గల్లా జయదేవ్ వ్యవహారాన్ని, ఆయన స్పందించిన విధానాన్ని తెరపైకి తెస్తున్నారు.
అవును… నారా లోకేష్ యువగళం యాత్ర ఏ ప్రాంతానికి చేరుకుంటే అక్కడి టీడీపీ ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు హడావిడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అయితే… టీడీపీ నేతల కంటే ఎక్కువగా వైసీపీ నుంచి సస్పెండ్ చేయబడిన నేతలే మరింత ఎక్కువ హడావిడి చేశారని చెబుతున్నారు. మరికొన్ని చోట్ల ఆశవాహులు మరింతగా చినబాబుకు స్వాగత కార్యకరమాలు ఏర్పాటు చేశారు.
ఆ సంగతి అలా ఉంటే… గుంటూరు, కృష్ణా జిల్లాల్లో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా జరిగింది. లోకేష్ యువగళం పాదయాత్రకు స్థానిక ఎంపీలు డుమ్మా కొట్టారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, విజయవాడ ఎంపీ కేశినేని నాని యాత్రకు రాకపోవడంపై టీడీపీ వర్గాల్లో కూడా గుసగుసలు వినపడుతున్నాయి. ఈ క్రమంలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ స్పందించారు.
లోకేష్ యువగళం పాదయాత్రకు గౌరహాజరవ్వడంపై గల్లా జయదేవ్ స్పందన అంటూ కొన్ని వార్తలు హల్ చల్ చేశాయి. “అర్ధరాత్రి పాదయాత్రలేమిటి.. మతిపోయిందా? – లోకేష్ పాదయాత్ర వల్ల ఒరిగేదేమీ లేదు” వంటి శీర్షికలతో కొన్ని వార్తలు స్ప్రెడ్ అయ్యాయి. అయితే తాజాగా లోకేష్ పాదయాత్రకు ఎందుకు రాలేదో చెప్పాలైన ఆయన… ఆ వార్తలను మాత్రం ఖండించి వదలడం గమనార్హం!
“టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారి మీద, ఆయన తలపెట్టేన పాదయాత్ర మీద నేను కొన్ని వ్యాఖ్యలు చేశానని వాట్సాప్ లో మరియు సోషల్ మీడియ లో ప్రచారం చేయడం జరుగుతోంది. ఇవి కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రచారం చేస్తున్నారు తప్ప ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. నేను ఈ వాఖ్యలు చేసినట్టు రుజువు లేకుండా, ఒట్టి నా ఫోటో వాడి ఇలా అసత్యాలు ప్రచారం చేయడం సరికాదు. నేను ఈ వార్తలని, వీరు అవలంబించిన పద్ధతులని తీవ్రంగా ఖండిస్తున్నాను”!
ఇది లోకేష్ పాదయాత్రకు గౌర్హాజరవ్వడంపై ఎపీ గల్లా జయదేవ్ స్పందన. ఈ వార్తలను ఖండించారు సరే… మరి గైర్హాజరీకి కారణం కూడా చెప్పాలి కదా! చెబితే బాగుండేది కదా! అలా కాకుండా… కేవలం కథనాలను ఖండించి చేతులు దులుపుకోవడం వల్ల ఎలాంటి సంకేతాలు ఇచ్చినట్లు అనే చర్చ మొదలైంది! ఏదీ ఏమైనా… టీడీపీలో ఇంకా చాలా లొసుగులే ఉన్నట్లున్నాయని అంటున్నారు పరిశీలకులు!