బ్రేకింగ్: పార్లమెంట్‌లో కేంద్రంపై నిప్పులు చెరిగిన ఎంపీ గల్లా జయదేవ్

పార్లమెంట్ లో అవిశ్వాసం పై జరిగిన చర్చలో టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ దాదాపు గంట పాటు ప్రసంగించారు.  ఏపికి జరిగిన అన్యాయంపై గల్లా పార్లమెంటులో గట్టిగా నిలదీశారు. కేంద్ర ఆర్దిక వ్యవస్థపై గల్లా జయదేవ్ నిప్పులు చెరిగారు. మాకు రావాల్సినవే అడుగుతున్నాం కానీ గొంతెమ్మ కోర్కెలు కోరటం లేదంటూ గల్లా ప్రసంగించారు. గల్లా ప్రసంగంలో ఇంకా ఏం చెప్పారంటే..

“హైదరాబాద్ ను అందరూ కలిసి అభివృద్ది చేశారు. రెండు జాతీయ పార్టీలు కలిసి ఏపికి అన్యాయం చేశాయి. ఏపికి కేంద్రం ప్రకటించిన ప్రాజెక్టులు కూడా నత్తనడకన కొనసాగుతున్నాయి. తెలుగు తల్లిని కాంగ్రెస్ రెండు ముక్కలు చేసిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఎన్నికలకు ముందు మోదీ ఏపికి వచ్చి ఎన్నో హామీలనిచ్చారు. మోదీ ఏదో చేస్తారని నాలుగేళ్లుగా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఏపికి ఏమీ చేయలేదు. అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఎన్నో హామీలిచ్చారని వాటిని అమలు చేయాల్సిన బాధ్యత తర్వాత వచ్చిన ప్రభుత్వంపై లేదా?  మా గొంతు నొక్కి పార్లమెంట్ తలుపులు మూసి పార్లమెంట్ లో బిల్లు పాస్ చేశారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ కాదని ఆంధ్రప్రదేశ్” అని గల్లా అన్నారు. దీంతో తెలంగాణ ఎంపీలు గల్లా వ్యాఖ్యలకు నిరసనగా వెల్ లోకి వెళ్లి నిరసన తెలిపారు. స్పీకర్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో వారు తమ సీటులోకి వెళ్లి కూర్చున్నారు.

ఆ  తర్వాత గల్లా  మాట్లాడుతూ “పది ఏళ్ల పాటు ప్రత్యేక  హోదా ఇస్తామని బిజెపి మోసం చేసింది. కేంద్ర ప్రభుత్వం తీరుపై ఏపి ప్రజలు అసహనంతో , తీవ్ర ఆగ్రహంలో ఉన్నారు. 5 కోట్ల మంది ప్రజలకు విశ్వాసం కల్పించడంలో కేంద్రం విఫలమైంది. 14వ ఆర్థిక సంఘంలో అన్యాయం చేశారు. రెవిన్యూ లోటు ఉన్న రాష్ట్రం ఏపి అని అయినా ఏపికి కేంద్రం సాయం అందడం లేదు. వివిధ సెస్ ల కింద 2.5 లక్షల కోట్లు వసూలు చేశారు. ఏ రాష్ట్రానికి ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు.   ఇది టిడిపి బిజెపి ల ధర్మయుద్దం కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజల ధర్మపోరాటం. పొరుగు రాష్ట్రాలకంటే వెనుకబడి ఉన్నందునే ఏపికి ప్రత్యేకహోదా ప్రకటించారు. మరి దాని అమలులో ప్రభుత్వం విఫలమైంది. బుందేల్ ఖండ్ కు 7200 కోట్లు ప్యాకేజి ఇచ్చారు. 4 ఏండ్లలో బుందేల్ ఖండ్ కు 20,000 కోట్ల సాయం చేశారు. ఏపికి 7 జిల్లాలకు 350 కోట్ల రూపాయల సాయం చేసి మళ్లి వాటిని వెనక్కు తీసుకున్నారు. ఏపికి ఇస్తామన్న ప్రత్యేక ప్యాకేజిలో ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఆస్తులు తెలంగాణకు, అప్పులు తెలంగాణకు ఇచ్చారు. పుదుచ్చేరి, బెంగాల్ సీఎంలు కూడా ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మహారాష్ట్ర శివాజి విగ్రహానికి 3000 కోట్ల రూపాయలు ఇస్తే, గుజరాత్ లో పటేల్ విగ్రహానికి 2000 కోట్లు ఇచ్చారు మరి రాజధాని నిర్మాణం కోసం 1500 కోట్లు కేటాయిస్తారా? రాజధాని నిర్మాణం కోసం రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారు.  ఆ రైతుల త్యాగాలనైనా కేంద్ర ప్రభుత్వం గుర్తించదా? గుజరాత్ లో డల్హోరా సిటి అబివృద్ది కోసం లక్ష కోట్లు వెచ్చిస్తున్నారు. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన సహాయం ఏ విధంగా  సరిపోతుంది. రైతుల  నుంచి భూమి సేకరిస్తున్నప్పుడు ప్రతిపక్షాలు అంత భూమి ఎందుకని ప్రశ్నించాయి. 48000 వేల ఎకరాలతో నేవీ ముంబయి నిర్మించడం నిజం  కాదా, ఢిల్లిని తలదన్నే రాజధాని నిర్మిస్తామని తిరుమలేశుని సాక్షిగా మోదీ చెప్పారు.  కేంద్రం నుంచి రావాల్సిన, అందాల్సిన సహాయాన్ని, నిధులను రాకుండా కేంద్రం కక్ష్యపూరితంగా వ్యవహరిస్తుంది. ప్రజాస్వామ్య బద్దంగా, న్యాయంగా రావాల్సిన నిధులే అడుగుతున్నాం. హోదాను ఇస్తామని బిజెపి మ్యానిఫెస్టోలో చెప్పింది. ఇప్పుడు మాట తప్పి బిజెపి ప్రవర్తిస్తుంది. మోదీ మోసాగాడిలా వ్యవహరిస్తున్నాడు. సభలో ఒక మాట, బయట ఒక మాట చెప్పడం సరికాదు. వెంటనే ఏపికి ఇచ్చిన హామీలన్ని అమలు చేయాలి” అని గల్లా జయదేవ్ పార్లమెంటులో దాదాపు గంట పాటు ప్రసంగించారు.