సినిమాలేమో ఫుల్లు.! రాజకీయాలేమో డల్లు.! ఎందుకిలా పవన్.?

కొత్త సినిమా ప్రారంబమవుతోంది.! సుజీత్ దర్శకత్వంలో పవణ్ కళ్యాణ్ హీరోగా రూపొందనున్న సినిమా ఇది. రేపు ప్రారంభోత్సవం కూడా.! ఇకనేం, పవన్ కళ్యాణ్ అభిమానులకు పెద్ద పండగే ఇది. అన్నట్టు, ‘హరి హర వీర మల్లు’ సినిమా ఎంతవరకు వచ్చింది.? ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పరిస్థితేంటి.? అవి మాత్రం అడక్కూడదు.

నిర్మాతలకీ సమస్య లేదు.. దర్శకులకీ ఇబ్బంది లేదు.. పవన్ కళ్యాణ్ సంగతి సరే సరి.! ఓ వైపు సినిమాల్లో బిజీగా వుంటూ, ఇంకో వైపు రాజకీయాలు చేయడం కుదిరే పనేనా.? అందునా, త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయ్. త్వరలో అంటే, ఈ ఏడాది చివర్లో తెలంగాణలో, వచ్చే ఏడాది ప్రారంభంలో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరుగుతాయ్.

మరి, ఆ ఎన్నికలకు రాజకీయంగా సిద్ధమవ్వాలా వద్దా.? ఏమో, జనసేనాని ఆలోచనలేమిటో.! జనసేన పార్టీ ముఖ్య నేతలకు కూడా అసలు విషయం అర్థం కావడంలేదు. ఆయన మాత్రం ‘ఆ కిక్కే వేరప్పా..’ అనుకుంటూ.. సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. తప్పదు.. ఒప్పుకున్న సినిమాలైతే పూర్తి చేయాలి. కానీ, ఎలా.? అదే ఓ మిలియన్ డాలర్ క్వశ్చన్‌లా తయారైంది. సినిమా అంటే ఒక్కడి వ్యవహారం కాదు. రాజకీయాల వల్ల ఒక్కరోజు షూటింగ్ తేడా కొట్టినా.. మొత్తం షెడ్యూల్ మారిపోతుంది.

అన్నట్టు, ఈ నెలలోనే సముద్ర ఖని దర్శకత్వంలో ఓ సినిమాని పవన్ సెట్స్ మీదకు తీసుకెళ్తాడన్నారు. అదేమయ్యిందో తెలీదు. వచ్చే ఎన్నికలపైనా పెద్దగా అంచనాల్లేకపోవడంతో.. ఈలోగా సినిమాలు హాయిగా చేసుకుందామని పవన్ అనుకుంటున్నారేమో.!