బీజేపీ- జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ రత్నప్రభ !

తిరుపతి లోక్ సభకు జరగనున్న ఉప ఎన్నికల్లో బీజేపీ, జనసేన తరఫున మాజీ ఐఏఎస్ అధికారిణి, కర్ణాటక చీఫ్ సెక్రెటరీగానూ విధులు నిర్వహించిన రత్నప్రభ పేరు పరిశీలనలో ఉన్నట్టు ప్రసారమాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం అవుతుంది. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన ఆమె, పలు ప్రభుత్వ విభాగాల్లో సేవలందించారు.

ముఖ్యంగా కర్ణాటకలోని పలు జిల్లాల కలెక్టర్ గానూ, వివిధ శాఖల కార్యదర్శిగాను, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగానూ పనిచేశారు. డిప్యుటేషన్ పై ఆంధ్రప్రదేశ్ లోనూ పనిచేశారు. రిటైర్ అయిన తరువాత ఆమె వృత్తి నైపుణ్య అథారిటీ చైర్ పర్సన్ గానూ విధులు నిర్వహించారు. ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రత్నప్రభ అయితే, వైసీపీని దీటుగా ఎదుర్కోవచ్చన్న ఆలోచనలో ఇరు పార్టీల నేతలూ ఉన్నట్టు తెలుస్తోంది.

దీంతో ఆమెను ఒప్పించి, బరిలో దింపాలని రెండు పార్టీలూ భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా, రత్నప్రభ తండ్రి కత్తి చంద్రయ్యతో పాటు భర్త విద్యా సాగర్, సోదరుడు ప్రదీప్ చంద్రలు ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారులుగా పనిచేశారు. రత్న ప్రభ SC సామాజికవర్గానికి చెందిన అధికారి. రాష్ట్ర ప్రభుత్వ SC, ST ఉద్యోగులకు పదోన్నతులు రావడంలో ఆమె విశేష కృషి చేశారు. 2016లో ఇన్వెస్ట్ కర్ణాటక సమ్మిట్ ను నిర్వహించి.. అమెరికన్ బయోగ్రాఫికల్ ఇన్ స్టిట్యూషన్ వారి ఉమన్ ఆఫ్ ఇయర్ అవార్డ్ ను ఆమె దక్కించుకున్నారు. మొదట్లో రాయచూర్ జిల్లాకు మొదటి మహిళా కలెక్టర్ గా విధులు నిర్వహించారు రత్నప్రభ.