ఏపీ బీజేపీకి సీఎం అభ్యర్థి దొరికేశారోచ్.!

బీజేపీతో తాడో పేడో తేల్చుకోవడానికే ఢిల్లీకి వెళ్ళారట జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అలాగని ప్రచారం జరుగుతూ వచ్చిన సంగతి తెలిసిందే. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయి, తిరిగొచ్చేశారు జనసేన అధినేత. అంతే తప్ప, ప్రధాని అపాయింట్మెంట్‌గానీ, కేంద్ర హోంమంత్రి అపాయింట్మెంట్‌గానూ పవన్ కళ్యాణ్ పొందలేకపోయారు.

మిత్రపక్షం కదా.. జనసేనకు బీజేపీ ఒకింత అదనపు అవకాశం కల్పించి వుండాల్సింది. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా‌లతో సన్నిహిత  సంబంధాలున్నాయని చెప్పే పవన్ కళ్యాణ్, ఎందుకు ఆ ఇద్దరి ‘దయ’ పొందలేకపోయారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇదిలా వుంటే, తాజాగా ఏపీ బీజేపీకి ఓ వెలుగు వచ్చింది.. అదీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రూపంలో. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే రాజీనామా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి, తాజాగా ఢిల్లీ వేదికగా, బీజేపీలో చేరారు. బీజేపీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తాననీ చెప్పారు.

అయితే, కిరణ్ కుమార్ రెడ్డిని ‘ముఖ్యమంత్రి అభ్యర్థిగానే’ బీజేపీ చూస్తోందనే ప్రచారం తెరపైకొచ్చింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి ఆయన. ఆయన ముఖ్యమంత్రిగా వున్నప్పుడే, రాష్ట్రం రెండుగా విడిపోయింది. ఆ తర్వాత సమైక్యవాదంతో ఏదో పార్టీ పెట్టి.. మమ అనిపించారు. తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు.. ఇటీవలే ఆ పార్టీకి ఇంకోసారి రాజీనామా చేశారు. పవన్ కళ్యాణ్‌కి చెక్ పెట్టే క్రమంలో ‘రెడ్డి’ కోటా కోణంలోనూ కిరణ్‌ని బీజేపీ కలుపుకుందట.!