ముందే పొత్తు వ్యవహారంపై స్పష్టత ఇచ్చేస్తే, ఎన్నికల నాటికి అంతా మంచే జరుగుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావించారు. ఈ క్రమంలోనే టీడీపీతో పొత్తుని ప్రకటించేశారు. అంతేనా, టీడీపీ – జనసేన మధ్య సమన్వయ కమిటీల సమావేశాలూ జరుగుతున్నాయి.
సాధారణంగా అయితే ఎన్నికల వేళ పొత్తులు కుదురుతాయి. అప్పటికప్పుడు తాత్కాలిక ఒప్పందాలు సెట్ చేసుకుని, ఆయా పార్టీలు ఎన్నికలకు వెళుతుంటాయి. కానీ, ఇక్కడ కాస్త భిన్నంగా నడుస్తోంది పరిస్థితి. అది జనసేన ముందస్తు వ్యూహమేనని అనుకోవాలా.? అంతేనేమో.!
ఇరు పార్టీల మధ్యా నడుస్తున్న సమన్వయ కమిటీ సమావేశాలు, గందరగోళంగా తయారవుతున్నాయి కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి. చాలా నియోజకవర్గాల్లో జనసేన – టీడీపీ సమన్వయ కమిటీల సమావేశాలు సజావుగానే సాగుతున్నా, కొన్ని నియోజకవర్గాల్లో పంచాయితీ తెగడంలేదు.
వచ్చే ఎన్నికల్లో ఎవరి బలం ఎంత.? ఏయే స్థానాల్లో ఎవరెవరు పోటీ చేయాలి.? అన్నదానిపై ఇరు పార్టీల్లోనూ నడుస్తున్న రచ్చ ఇది. ఈ రచ్చ ముందే జరగడం మంచిదేననీ, ఎన్నికల నాటికి పరిస్థితులు సద్దుమణుగుతాయనీ జనసేన పార్టీ భావిస్తోంది.
అయితే, టీడీపీ నేతల ఆలోచన ఇంకోలా వుంది. అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలే సత్ఫలితాలనిస్తాయన్నది టీడీపీలో కొందరు కీలక నేతల వాదన. ‘టీడీపీతో పొత్తుని జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటించేసుకున్నారు. చంద్రబాబు ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు కదా.?’ అన్నది సోకాల్డ్ టీడీపీ నేతల వాదన.
ఎవరేమనుకున్నా, వచ్చే ఎన్నికలు తమకు అత్యంత కీలకం గనుక, జనసేన మాత్రం వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. ఒకవేళ అప్పటికి టీడీపీతో పొత్తు కుదరకున్నా, పార్టీ బలోపేతం దిశగా ఈ సమావేశాలు తమకు ఉపయోగపడ్తాయన్నది జనసేన భావన అట. కొట్టుకునేదాకా టీడీపీ – జనసేన నేతలు కొన్ని చోట్ల అతి చేస్తున్నారంటే.. దానర్థమేంటి.?