చంద్రబాబు ఇంటిముందు రైతుల ధర్నా

చంద్రబాబునాయుడు నివాసముంటున్న లింగమనేని రమేష్ అక్రమనిర్మాణంపై రోజు రోజుకు వివాదం పెరిగిపోతోంది. ఆదివారం చంద్రబాబు నివాసముంటున్న భవనం ముందు రైతులు భారీ ఎత్తున ధర్నా చేశారు.  లింగమనేని భవనంలోకి చంద్రబాబు వెళ్ళేముందు తమ పొలాన్ని బలవంతంగా తీసుకున్నట్లు రైతులు ప్రకాష్, సాంబశివరావులు రెండు రోజులుగా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.

భవనంలోకి వెళ్ళేందుకు రోడ్డు లేనికారణంగా ప్రభుత్వమే రైతుల పొలాన్ని తీసేసుకుంది. అప్పట్లో రెండేళ్ళ తర్వాత చంద్రబాబు భవనాన్ని ఖాళీ చేసి వెళ్ళేటపుడు రైతుల భూమిని తిరిగి ఇచ్చేస్తామని ప్రభుత్వం చెప్పిందట. పైగా వేసే రోడ్డు కూడా కేవలం మట్టిరోడ్డు మాత్రమే వేస్తామని, పది అడుగులు ఇస్తే చాలని తీసుకున్నట్లు వారు ఆరోపిస్తున్నారు.

కానీ ఆచరణలోకి వచ్చేసరికి అంతా మారిపోయిందంటున్నారు. పది అడుగులు కాస్తా 20 అడుగులైపోయిందట. మట్టి రోడ్డని చెప్పి తారు రోడ్డు వేశారట. రెండేళ్ళల్లో సొంతభవనం కట్టుకుని వెళ్ళేటపుడు పొలం తిరిగి ఇచ్చేస్తామని చెప్పి ఐదేళ్ళయినా  అక్కడే ఉన్నట్లు చెబుతున్నారు. తమ పొలాన్ని తమకు తిరిగిచ్చేయాలంటూ రైతులు ధర్నా చేశారు.

ధర్నా చేస్తున్న రైతులకు మంగళగిరి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి కూడా మద్దతు తెలిపారు. అక్రమనిర్మాణమని ప్రభుత్వం లింగమనేని రమేష్ కు నోటీసులిస్తే టిడిపి స్పందించటం ఏమిటంటూ మండిపడ్డారు. భవనం యజమాని లింగమనేని ఎందుకు స్పందిచటం లేదంటూ ఆళ్ళ వేసిన ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్పాలి ?