మెగాస్టార్ చిరంజీవి, ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పటి పరిస్థితులు వేరు.. జనసేన పార్టీకి సంబంధించిన పరిస్థితులు వేరు. చిరంజీవి అభిమానులే అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలయ్యారు. కానీ, పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన కార్యకర్తలుగా మారడంలేదా.? ఈ విషయమై జనసేన పార్టీ కూడా చాలా చాలా సందిగ్ధంలో వుంది.
తాజాగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి కడప జిల్లాలో ‘జనసేన కౌలు రైతు భరోసా యాత్ర’ పేరుతో పర్యటిస్తున్నారు. షరామామూలుగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి అభిమానులు, కార్యకర్తలు బ్రహ్మరథం పట్టేశారు. కనీ వినీ ఎరుగని రీతిలో ర్యాలీ నడిచింది.
ఇసకేస్తే రాలనంత జనం.. ఎటు చూసినా జనం.! ఆ జన సందోహాన్ని చూసి జనసేనాని మురిసిపోవడమూ సర్వసాధారణమే. ఈ అభిమానం కొత్తగా వచ్చింది కాదు. ఎప్పటినుంచో వున్నదే. కానీ, ఆ అభిమానాన్ని ఓట్లుగా పవన్ కళ్యాణ్ ఎందుకు మలచుకోలేకపోతున్నారు.?
నిజానికి, జనసేన పార్టీ ఈ విషయమై ఆత్మవిమర్శ చేసుకోవాలి. కానీ, చేసుకోవడంలేదు. అభిమానుల ఓట్లు ఏమైపోతున్నాయ్.? అని జనసేనాని గనుక ప్రశ్నించుకోగలిగితే, సమాధానం దొరకడం పెద్ద కష్టమేమీ కాదు. 2014 ఎన్నికల నాటికే జనసేన పార్టీ ఆవిర్భవించింది. ఈ ఎనిమిదేళ్ళలో జనసేన పార్టీ ఎంతమేర బలం పుంజుకోగలిగింది.?
స్థానిక ఎన్నికల్లో ఫర్వాలేదన్పించింది. కానీ, అధికార వైసీపీని ఢీకొనేంత సత్తా జనసేనకు లేదు. ప్రధాన పార్టీల లెక్కలో వైసీపీ, ఆ తర్వాత టీడీపీ.. మూడో స్థానంలో జనసేన. జనసేన కాదు, మేమే గొప్ప.. అంటోంది బీజేపీ. మరెలా జనసేన బలపడేది.? ఏమో, జనసేనాని రాజకీయ వ్యూహాలు ఏమైనా మారుతాయో లేదో.!