ఆంధ్రప్రదేశ్‌కి చిరంజీవి ముఖ్యమంత్రి కావడమేమిటి, ఆయనసలు రాజకీయాల్లోనే లేరు కదా. ఆయనేదో తనపాటికి తాను సినిమాలు చేసుకుంటున్నారు. ఆయనపై ఇలాంటి వార్తలేమిటి అనుకుంటున్నారా. నిజమే చిరంజీవి రాజకీయాల్లో లేరు కానీ ఆయన మీద రాజకీయాల నీడ మాత్రం అలానే ఉంది. అదే ఆయన్ను నిత్యం రాజకీయ గొడవల్లోకి లాగుతోంది. ఎప్పుడైతే చిరు కాంగ్రెస్ పార్టీలో సైలెంట్ అయిపోయారో అప్పటి నుండి ఆయన వెనుక బీజేపీ పడింది. ఆయన్ను మళ్లీ రాజకీయాల్లోకి లాగడానికి చాలా ప్రయత్నాలే జరిగాయి. అధికారికంగా చిరు కూడ చెప్పడం లేదు కానీ ఆయన వద్దకు జాతీయ పార్టీల నేతలు చాలా రాయబారాలే నడిపారు. అవి గనుక ఫలించి ఉంటే ఈపాటికి ఆయన ఏదో ఒక పార్టీలో ఉండటం, గత ఎన్నికల బరిలో నిలిచి ఉండటం జరిగేవి.
అయితే చిరు కాంప్రమైజ్ కాలేదు. సొంత తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినా అందులోకి కూడ వెళ్లలేదు. అయినా ఆయన్ను రాజకీయాల్లోకి లాగుతూనే ఉన్నారు. ముఖ్యంగా ఆయన్ను బీజేపీకి అంటగట్టే ప్రయత్నాలే ఎక్కువగా జరుగుతున్నాయి. గత కొన్నిరోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో హిందూ మతం మీద దాడులు జరుగుతున్నాయనే వివాదం నడుస్తోంది. వరుసగా పిఠాపురం, నెల్లూరు, అంతర్వేది దేవాలయాల్లో దాడులు, ప్రమాదాలు జరగడమే ఈ వివాదానికి కారణం. ఈ అంశం మీద ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కంటే జనసేన – బీజేపీల కూటమి ఎక్కువగా పోరాటం చేస్తోంది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఒక మతం కోసమే హిందూ మతం మీద దాడులని అంటుండగా పవన్ ఈ దాడుల వెనుక ఖచ్చితంగా ఏదో కుట్ర ఉందని సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ఛలో అంతర్వేదికి సిద్దమయ్యారు ఇరు పార్టీల వారు.
దీంతో ఈ రెండు పార్టీలే ఎక్కువగా హైలెట్ అవుతున్నాయి. తాజాగా మాజీ ఎంపీ హర్షకుమార్ ఈ వ్యవహారం మీద స్పందిస్తూ కేవలం ఘటన జరిగిన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ దళితుడు కాబట్టి, వైసీపీ మద్దతుదారు కాబట్టి జనసేన ఇంత రభస చేస్తోందని అన్న ఆయన బీజేపీ ఆర్.ఎస్.ఎస్ ద్వారా రాజోలు నియోజకవర్గంలోని కాపులను రెచ్చగొట్టాలని చూస్తున్నారని, అసలు సోము వీర్రాజుకు చిరంజీవి ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యమని, చిరంజీవి కుటుంబానికి సోము వీర్రాజు హనుమంతుడిలా మారారని అన్నారు. ఈ మాటలు విన్న జనం ఆలోచనలో పడ్డారు. సోము వీర్రాజు అధ్యక్షుడు అయ్యాక మొదటగా వెళ్లి చిరంజీవిని కలవడాన్ని గుర్తు చేసుకుని కొంపదీసి 2024కి బీజేపీ – జనసేన కూటమి అభ్యర్థి చిరంజీవేనా ఏమిటి. ఒకవేళ హర్షకుమార్ అంటున్నట్టు కాపు కులాన్ని వశపరుచుని చిరంజీవిని ముఖ్యమంత్రిని చేసేయాలని బీజేపీ భావిస్తోందా, అదొక్క ప్లాన్ వర్కవుట్ అయితే చిరంజీవి సీఎం అయిపోతారా అంటూ స్వీయ ప్రశ్నలు వేసుకుంటున్నారు.