రాజకీయ పార్టీల నడుమ, నేతల నడుమ చోటు చేసుకునే అనేక సంఘటనల్లో కొన్ని మాత్రమే బయటికొస్తుంటాయి. కొన్ని మాత్రం ఎవ్వరికీ తెలియకుండానే మరుగునపడిపోతుంటాయి. అలా మరుగునపడ్డ కొన్ని విషయాలు అనుకోని విధంగా రివీల్ అవుతుంటాయి. అలాంటి ఒక విషయాన్నే మాజీ ఎంపీ హర్షకుమార్ బయటపెట్టారు. ఆయన బయటపెట్టిన విషయం ఆయనకు, ప్రజారాజ్యానికి, పవన్‌కు మధ్యన జరిగిందట. జి.వి. హర్షకుమార్ కాంగ్రెస్ హయాంలో ఒక వెలుగు వెలిగారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమైన నేతల్లో ఒకరిగా వ్యవహరించారు.
అలా కాంగ్రెస్ హవా కొనసాగుతున్నప్పుడే చిరంజీవి ‘ప్రజారాజ్యం‘ పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీకి దిగారు. చిరంజీవికి సామాజికవర్గం పరంగా గోదావరి జిల్లాల్లో బలం ఎక్కువ. అమలాపురం లోక్ సభ స్థానం నుండి 2009లో కాంగ్రెస్ తరపున హర్షకుమార్ పోటీకి దిగారు. గోదావరి జిల్లాల్లో జెండా ఎగరేయాలనుకున్న చిరు హర్షకుమార్ మీద పోతుల ప్రమీలా దేవిని నిలబెట్టారు. హోరా హోరీగా జరిగిన పోటీలో 40 వేల ఓట్ల మెజారిటీతో హర్షకుమార్ గెలిచారు. అంతకుముందు 2004లో ఆయనే అక్కడ ఎంపీ కావడంతో చిరు హవాను ఎదిరించి గెలవగలిగారు. అంతేకాదు గోదావరి జిల్లాలో ప్రజారాజ్యం ఆశించిన స్థాయిలో సీట్లు తెచ్చుకోలేక పరాజయం చెందడానికి తానే కారణమని అన్నారు హర్షకుమార్.
రాష్ట్రం విడిపోయాక కాంగ్రెస్ నుండి జైసమైక్యాంధ్ర పార్టీలోకి వెళ్లిన హర్షకుమార్ పవన్ కళ్యాణ్ ‘జనసేన’ పెట్టగానే అందులోకి వెళ్లాలని అనుకున్నారట. అందుకే తన శ్రేణులను ఆ పార్టీలోకి పంపానని, ఈ సంగతి తెలిసి పవన్ నేరుగా వచ్చి యాతనను పార్టీలోకి ఆహ్వానిస్తారని తెలిసిందని, కానీ ఎందుకో రాలేదని అలా తాను జనసేనలో చేరలేదన్న హర్షకుమార్ పవన్ తనను ఆహ్వానించకపోవడానికి రీజన్ ఆయన అభద్రతా భావమని అన్నారు. ఆయన మాటలను బట్టి తాను పార్టీలోకి వస్తే తనకంటే పెద్ద లీడర్ అయిపోతాడని భయపడిన పవన్ ఆయనకు ఆహ్వానం పలకలేదనేది హర్షకుమార్ అభిప్రాయం కావొచ్చు. ఇకపోతే ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీలోని లేని హర్షకుమార్ తిరిగి కాంగ్రెస్ గూటికే వెళతారనే ప్రచారం ఉంది.