అవినాశ్ రెడ్డి ఎందుకు తప్పించుకు తిరుగుతున్నారు.?

ఏమో, అవినాశ్ రెడ్డి తల్లికి నిజంగానే గుండె పోటు వచ్చిందేమో.! ఏమో, తల్లి అనారోగ్యం చూసి తనయుడు అవినాశ్ రెడ్డి కూడా అనారోగ్యం బారిన పడ్డారేమో.! ఇలా పాజిటివ్ యాంగిల్‌లో చూస్తే, కడప ఎంపీ అవినాశ్ రెడ్డి విషయంలో అనుమానాలకు ఆస్కారం లేదు.

అదే, నెగెటివ్ యాంగిల్‌లో చూస్తే.? జరుగుతున్న పరిణామాల్ని పరిగణనలోకి తీసుకుంటే.? ‘అవినాశ్ రెడ్డి పారిపోయాడు’ అన్న భావన కలగడం సహజమే. సీబీఐ విచారణకు హాజరైతే ఏమవుతుంది.? ఒకవేళ అరెస్టు అవ్వాల్సి వస్తే ఏమవుతుంది.? ఏమీ అవదు.

రాజకీయ నాయకులు సీబీఐ విచారణలకీ, అరెస్టులకీ భయపడతారని అనుకోలేం. అరెస్టు, బెయిలు.. ఇదో సర్వసాధారణమైన ప్రక్రియ రాజకీయ నాయకులకి. అరెస్టులు, బెయిల్.. అన్నీ రాజకీయ కోణాల్లోనే వుంటున్నాయన్నది ఇటీవలి కాలంలో చాలా కేసుల విషయంలో చూస్తున్నాం.

‘రాజకీయ కుట్ర’ అని ఎదురుదాడికి దిగితే, సింపతీ పెరుగుతుంది.. రాజకీయంగా కలిసొస్తుంది కూడా.! మరెందుకు, అవినాశ్ రెడ్డి పారిపోతున్నట్టు.? ఈ విషయమై భిన్న వాదనలు వైసీపీ శ్రేణుల్లోనే వినిపిస్తున్నాయి. విచారణకు హాజరై వుంటే, ఈ అనుమానాలకు ఆస్కారమే వుండేది కాదు.

ఇక్కడ సీబీఐ కూడా ఓ చిత్రమైన ఆట ఆడుతోంది. బెయిల్ వద్దంటుంది.. అరెస్టు చేయకుండా నాన్చుతోంది.! ఎందుకింత హైడ్రామా.?