ముఖ్యమంత్రి అభ్యర్థిగా అప్పుడే పవన్ కళ్యాణ్ పేరుని బీజేపీ దాదాపుగా ఖరారు చేసేసింది. జనసేన – బీజేపీ సంయుక్తంగా అధికారంలోకి వస్తాయనీ, అప్పుడు పవన్ కళ్యాణే తమ అభ్యర్థి అనీ బీజేపీ చెప్పేసింది. నిజానికి, పవన్ కళ్యాణ్ కాదు.. బీజేపీకి, మాజీ కేంద్ర మంత్రి.. సినీ నటుడు చిరంజీవి పట్ల ప్రత్యేక దృష్టి వుంది. కానీ, చిరంజీవి రాజకీయాల పట్ల అంతగా ఆసక్తి చూపడంలేదిప్పుడు. కేవలం తిరుపతి ఉప ఎన్నికలో గెలవడం కోసమో.. లేదంటే, తమ ఉనికిని చాటుకోవడానికో.. ఇవేవీ కాదు, కాపు సామాజిక వర్గాన్ని తమవైపుకు తిప్పుకోవడం కోసమో..
బీజేపీ, పవన్ కళ్యాణ్ పేరుని తెరపైకి తెచ్చి వుండొచ్చునన్నది చాలామంది అభిప్రాయం. కానీ, ఈ ప్రకటనతో బీజేపీకి కొంత సానుకూల స్పందన అయితే కనిపిస్తోంది. బీజేపీ కంటే జనసేనకి ఎక్కువ అడ్వాంటేజ్ అవుతోంది ఈ ప్రకటన. వైసీపీ, టీడీపీకి చెందిన కొందరు కాపు నేతలు, ఒక్కసారిగా ఈ ప్రకటనతో షాక్‌కి గురయ్యారట. పవన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వుందా.? వుంటే, వెంటనే అటువైపు వెళ్ళిపోవడమే మంచిది.. అని కాపు సామాజిక వర్గ పెద్దలు, కాపు సామాజిక వర్గ నేతలకు సూచిస్తున్నారట. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గానికి సంబంధించి అత్యవసర సమావేశాలు అత్యంత రహస్యంగా జరుగుతున్నాయట. అయితే, అధికార వైసీపీ మాత్రం ‘అంత సీన్ లేదు’ అని కొట్టి పారేస్తోంది. బీజేపీ, జనసేనను మోసం చేస్తోందనీ.. ప్రత్యేక హోదా విషయంలో చేసినట్లే పవన్ కళ్యాణ్‌కి ముఖ్యమంత్రి పదవి విషయంలోనూ వెన్నుపోటు తప్పదనీ వైసీపీకి చెందిన కాపు సామాజిక వర్గ నేతలు అప్పుడే తమదైన స్టయిల్లో స్పందిచేస్తున్నారు.
ఏమో గుర్రం ఎగరా వచ్చు. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. వైసీపీ సంగతి పక్కన పెడితే, టీడీపికి చెందిన కాపు నేతలైతే, ఈ సాకుతో టీడీపీని వదిలి.. బీజేపీ పంచన చేరేందుకు అప్పుడే మంతనాలు కూడా షురూ చేసేశారట.