పెయిడ్ ఆర్టికల్స్… మీడియాకు ఈసీ స్ట్రాంగ్ వార్నింగ్!

ఏపీలో ఎన్నికల వాతావరణం నేటి నుంచి మరింత వేడెక్కనుంది. నోటిఫికేషన్ రావడం, ఇక ఎన్నికల ప్రచారంలోకి పార్టీలన్నీ ఒకేసారి బలంగా దూకడం, అభ్యర్థుల ఎంపికను ఫైనల్ చేయడం మొదలైన విషయాలతో ఏపీలో రసవత్తర రాజకీయం మొదలుకాబోతుంది. ఈ సమయంలో మీడియా పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఇప్పటికే ఏపీలో ఒకవర్గం మీడియా ఆయా పార్టీలకు కర పత్రాలుగా మారిపోయాయనే విమర్శలు అత్యంత బలంగా ఉన్నాయి! ఈ సమయంలో ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది.

అవును.. ఏపీలో రాజకీయ పార్టీల మధ్య జరిగే ఫైట్ కంటే… రాజకీయ పార్టీలకు తమ వ్యతిరేక వర్గ మీడియాతో జరిగే ఫైటే పెద్దదిగా ఉంటున్న పరిస్థితి నేటి రాజకీయాల్లో నెలకొంది. పత్రికా విలువలు గాలికి వదిలేసి నడుస్తున్న రోజులు ఇప్పుడు కళ్లముందు కదులుతున్న పరిస్థితి! జర్నలిజానికి అర్ధాన్ని మార్చేసి.. సరికొత్త ప్రతిపదార్ధాలు సృష్టితున్న పరిస్థితి! పైగా ఎన్నికల సమయం సమీపిస్తుంటే… ఏది పెయిడ్ ఆర్టికలో, ఏది ప్రెస్ నోటో తెలియని స్థాయిలో ఏకపక్ష కథనాలకు లోటుండదు.

ఈ సమయంలో ఎంటరైన ఈసీ పెయిడ్ ఆర్టికల్స్ పై సీరియస్ గా స్పందించింది. ఈ విషయంలో మీడియా ప్రతినిధులు ఎంతో అప్ర్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సూచించారు. ఎలక్షన్ టైం లో మీడియా అనుసరించాల్సిన విధి విధానాలపై ఈసీ జారీ చేసిన తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రవర్తించాలని ఆయన కోరారు. ఈ విషయంపై మీడియా ప్రతినిధులు అనుసరించాల్సిన విధివిధానాలను వివరించేందుకు ప్రత్యేక భేటీ నిర్వహించారు.

ఈ సందర్భంగా స్పందించిన ముఖేష్ కుమార్ మీనా… ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించే విషయంలో మీడియా పాత్ర ఎంతో కీలకమని అన్నారు. అందుకు తగినట్లుగా అన్ని ప్రసార మాధ్యమాల ప్రతినిధులు సహకరించాలని కోరారు. ఏ పార్టీకి చెందిన అభ్యర్థి అయినా నామినేషన్ దాఖలు చేసినప్పటి నుండి పెయిడ్ న్యూస్ అంశాన్ని సునిశితంగా పరిశీలిస్తామని తెలిపారు. దీనికోసం రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో ఉండే మీడియా మానిటరింగ్ కమిటీలు ఎంతో అప్రమత్తంగా పర్యవేక్షిస్తూ ఉంటాయని అన్నారు.

ఈ క్రమంలో… ఈసీ నిర్ధేశించిన ధరల పట్టిక ప్రకారం పెయిడ్ న్యూస్ ని లెక్కించి, ఆ మొత్తాన్ని సంబంధిత అభ్యర్థి ఖాతాలో జమచేస్తామని ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. ఈ విషయంలో పదే పదే నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం… సదరు సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెడతామని తెలిపారు. మీడియాలో ప్రకటనలకు సంబందించి ముందస్తుగా ఎం.సి. అనుమతి పొందాల్సి ఉంటుందని, అనుమతి పొందిన ఆర్డరు కాపీ నెంబరును కూడా సంబందిత ప్రకటనపై ముద్రించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

కాగా… ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి ఎంపీ అభ్యర్థి రూ.95 లక్షలు, ఎమ్మెల్యే అభ్యర్థి రూ.40 లక్షల మేర వ్యయం చేసేందుకు అమమతి ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పెయిడ్ న్యూస్ గా నిర్థారణ అయిన ఆర్టికల్స్ కు సంబందించి ధరల పట్టిక ప్రకారం ఫైనల్ చేయబడిన సొమ్మును సంబందిత అభ్యర్థి ఖర్చులో జమచేస్తామ‌ని చెప్పారు.