టాలీవుడ్‌లో డ్రగ్స్ కలకలం.! ఈసారీ అంతేనా.?

ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి.. అనడం సబబు కాదేమోగానీ, టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి తెలుగు మీడియా చేస్తున్న ‘అతి’ చూస్తోంటే, ఆ ‘హడావిడి’ ప్రస్తావన రాకుండా వుండదు.

మీడియా అనేది న్యూస్ కవర్ చేయొచ్చు. అనాలసిస్ తప్పకపోవచ్చు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. అంటూ కథనాలు తెరపైకి తీసుకురావొచ్చు కూడా. కానీ, జరుగుతున్న పరిణామాలకు భిన్నంగా, సొంత వంటకాలు చేస్తే ఎలా.?

మొన్నటికి మొన్న.. అంటే, కొన్నేళ్ళ క్రితం దర్శకుడు పూరి జగన్నాథ్, సినీ నటి అలాగే నిర్మాత కూడా అయిన ఛార్మి, పలువురు యువ నటులు.. ఇలా పలువురు సినీ ప్రముఖులు డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొన్నారు.

అంతే, వాళ్ళంతా అరెస్టయిపోతారంటూ ప్రచారం జరిగింది. కానీ, చివరికి ఏమయ్యింది.? ఎవ్వరూ అరెస్ట్ కాలేదు. కొందరు శాంపిల్స్ ఇచ్చారు.. కొందరు అదీ లేదు. ఆ కేసులో సినీ ప్రముఖులకు క్లీన్ చిట్ లభించింది.

ఇప్పుడు ఇంకోసారి మళ్ళీ అదే హంగామా. నిర్మాత కేపీ చౌదరి పేరు తెరపైకొచ్చింది. ఆయన ‘కబాలి’ సినిమాకి తెలుగు నిర్మాత. ఆయనతో అషు రెడ్డి, సురేఖా వాణి తదితర సినీ నటీమణులకు లింకులున్నాయన్నది తెలుగు మీడియా ఉవాచ.

అంతేనా.? ప్రముఖ నటులతోనూ కేపీ చౌదరికి సంబంధాలున్నాయా.? అరెస్టులు జరగబోతున్నాయ్.. ఈసారి సీరియస్.. అంటోంది తెలుగు మీడియా. గతంలో చూశాం కదా.. ఇప్పుడేం జరగబోతోందో అర్థం చేసుకోవడానికి ఆ అనుభవం సరిపోతుంది.!