అనంతపురం జిల్లా కదిరి అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా డాక్టర్ పీవీ సిద్ధారెడ్డి నియమితులయ్యారు. సోమవారం కదిరి పర్యటనకు వెళ్లిన పార్టీ జిల్లా ఇన్‌ఛార్జి, మాజీ లోక్‌సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. అధికారికంగా ఈ ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. టికెట్ తనకు దక్కుతుందనే ఉద్దేశంతో సిద్ధారెడ్డి సుమారు ఏడాది కాలం నుంచే నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు మద్దతుగా సిద్ధారెడ్డి కూడా కదిరి నియోజకవర్గం పరిధిలో పాదయత్ర చేశారు. గ్రామగ్రామానా ఆయన కలియ తిరిగారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలను సమన్వయం చేశారు. కదిరి అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్ సీపీదే. 2014 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి గెలుపొందిన అత్తర్ చాంద్‌బాషా.. పార్టీ ఫిరాయించారు. తెలుగుదేశం పార్టీలో చేరారు.
అప్పటి నుంచీ ఈ నియోజకవర్గం పరిధిలో వైఎస్ఆర్ సీపీకి సరైన దిశా నిర్దేశం లేదు. అదే సమయంలో సిద్ధారెడ్డి రంగప్రవేశం చేశారు. ఎమ్మెల్యే పార్టీ ఫిరాయించడంతో డీలా పడ్డ క్యాడర్‌లో నూతనోత్తేజాన్ని తీసుకొచ్చారు. కదిరి నియోజకవర్గంలో మైనారిటీలు పెద్ద సంఖ్యలు ఉన్నారు.
వారంతా వైఎస్ జగన్‌ను చూసే చాంద్‌భాషాను గెలిపించారని సిద్ధారెడ్డి చెబుతున్నారు. చాంద్‌భాషా పార్టీ ఫిరాయించినప్పటికీ గ్రామస్థాయిలో మైనారిటీల ఓటుబ్యాంకు చెక్కు చెదరలేదని, మరోసారి వారు వైఎస్ఆర్‌సీపీకే ఓటు వేస్తారని అంటున్నారు.