మంత్రి గుడివాడ అమర్నాథ్ అప్పుడెప్పుడో.. ఓ వేదికపై డాన్స్ చేశారట.! ‘రికార్డింగ్ డాన్సులేసుకునే మంత్రి’ అంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద రచ్చ జరిగింది.. ఆ రచ్చ జరుగుతూనే వుంది.
మరో మంత్రి రోజా సంగతి సరే సరి.! ఆమె ఎక్కడ డాన్స్ చేసినా, దానిపై జరిగే యాగీ అంతా ఇంతా కాదు. అత్యంత అసభ్యకరమైన రీతిలో మంత్రి రోజాపై ట్రోలింగ్ జరుగుతుంటుంది. తాజాగా, ఓ వైసీపీ ఎమ్మెల్సీకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రికార్డింగ్ డాన్సర్లంతా వైసీపీలోనే వున్నారేంట్రా.? అన్నది ఆ ట్రోలింగ్ సారాంశం.
ఈ రోజుల్లో డాన్స్ అనేది చాలా చాలా చిన్న విషయం. ఏదన్నా రాజకీయ కార్యక్రమం జరిగినా, దానికి జనాన్ని రప్పించే క్రమంలో డాన్సుల్ని దాదాపు తప్పనిసరి చేసేశారు. పాటలు పాడించడం, డాన్సులేయించడం.. ఇవన్నీ మామూలే.
సరే, అదెంతవరకు సబబు.? అన్నది వేరే చర్చ. కానీ, తప్పడంలేదు. చంద్రబాబు హయాంలో ‘చంద్రన్న..’ అంటూ పాటలు పాడించారు, డాన్సులేయించారు. ఇప్పుడు ‘జగనన్నా..’ అంటూ డాన్సులేయిస్తున్నారు. అంతే తేడా.! పవన్ కళ్యాణ్ డాన్సులు చేయడంలేదా.? నందమూరి బాలకృష్ణ డాన్సులు చేయడంలేదా.? అయితే, వాళ్ళు చేస్తోన్నది సినిమాల్లోనే.. అనడమూ సబబు కాదు. సందర్భానుసారం, ఆయా కార్యక్రమాల్లో ‘కాలు కదపడం’ అనేది మామూలే. విరగబడి డాన్సులేయడం కాదుగానీ, అక్కడున్నవారి కోరిక మేరకు ఓ చిన్న ‘స్టెప్’ వేయడం జరుగుతుంటుంది. వైసీపీ నేతలు చేసేది అయినా అదే.!