చంద్రబాబునాయుడు నిజంగా 40 ఇయర్స్ ఇండస్ట్రీనే అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఆ 40 ఇయర్స్ లో చంద్రబాబు స్ట్రైటుగా సాధించిన విజయాలు ఎన్నుయాన్న విషయాన్ని పక్కనపెడితే 3 ఫెయిల్యూర్లు మాత్రం భయంకరమైనవి. చంద్రబాబు స్ట్రైటుగా సాధించిన విజయాలు అంటే ప్రత్యర్ధి లేదా ప్రత్యర్ధులతో నేరుగా ఢీ కొని సాధించిన విజయాలెన్ని అంటే ఠపీమని ఎవ్వరూ చెప్పలేరు. అదే ఫెయిల్యూర్లు ఏమన్నా ఉన్నాయా అంటే మాత్రం తడుముకోకుండా మూడున్నాయని ఎవ్వరన్నా చెప్పేస్తారు.
ఇంతకీ ఆ ఫెయిల్యూర్లు ఏమంటే మొదటిది 2003లో తెలుగుదేశంపార్టీ ఒంటరిగా పోటీ చేసి ఓడిపోవటం. రెండోది ఓటుకునోటు కేసులో తగులుకోవటం. ఇక మూడో ఫెయిల్యూర్ తాజాగా బయటపడిన జగన్ పై హత్యాయత్నం ఘటన. తెలుగుదేశంపార్టీని పెట్టింది ఎన్టీయార్ అన్న విషయం అందరికీ తెలిసిందే. చీమలు కష్టపడి నిర్మించుకున్న పుట్టను పాము ఆక్రమించుకున్నట్లు ఎన్టీయార్ కష్టఫలాన్ని చంద్రబాబు చాలా తేలిగ్గా ఆక్రమించేసుకున్నారు. 1994లో పార్టీ అధికారంలోకి రాగానే లక్ష్మీపార్వతిని సాకుగా చూపించి 1995లో ఎన్టీయార్ కు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పీఠాన్ని లాక్కున్నారు.
సరే తర్వాత అంటే 1999 ఎన్నికల్లో బిజెపితో పొత్తు పెట్టుకుని వాజ్ పేయ పుణ్యమా అని ముఖ్యమంత్రయ్యారు. తర్వాత 2003లో తనపై మావోయిస్టుల దాడి నేపధ్యంలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు. సానుభూతి బ్రహ్మాండంగా ఉంది కాబట్టి మళ్ళీ మూడోసారి సిఎం అయిపోవచ్చని అనుకుని ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు. కాకపోతే మావోయిస్టుల దాడిని జనాలు ఏమాత్రం పట్టించుకోలేదు.
వైఎస్ పాదయాత్ర ఇమేజి ముందు మావోయిస్టుల దాడి సానుభూతి కూడా నిలవలేదు. అందుకనే ఓడిపోయారు. తర్వాత 2009లో మహాకూటమి పేరుతో టిఆర్ఎస్, వామపక్షాలను కలుపుకుని ఎన్నికలకు వెళ్ళారు. వైఎస్ ప్రాభవాన్ని తట్టుకోలేక మళ్లీ ఓడిపోయారు. అంటే చంద్రబాబు గెలిచిన ప్రతీసారి ఎవరో ఒకరితో పొత్తుపెట్టుకున్నారు. ఒక్కసారి మాత్రమే ఒంటరిగా పోటీ చేశారు, ఓడిపోయారు.
సరే రెండో ఫెయిల్యూర్ ఏమిటంటే, ఓటుకునోటు కేసు. పోయిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే తెలంగాణాలో కెసియార్ ప్రభుత్వాన్ని కూలదోద్దామని ప్లాన్ వేశారు. ఈ విషయాన్ని కెసియార్ ఇపుడు స్వయంగా చెబుతున్నారు. అప్పట్లో ఎంఎల్ఏ కోటాలో ఎంఎల్సీ ఎన్నికలు జరిగాయి. నిజానికి ఏ రకంగా చూసుకున్నా టిడిపి అభ్యర్ధి గెలిచే అవకాశమే లేదు.
అయినా సరే టిఆర్ఎస్ ఎంఎల్ఏలకు గాలమేసి తనవైపు తిప్పుకుందామని అనుకున్నారు. అందులో భాగంగానే నామినేటెడ్ ఎంఎల్ఏ స్టీఫెన్ సన్ తో రూ 5 కోట్లకు బేరం కుదుర్చుకున్నారు. బేరంలో భాగంగా అడ్వాన్స్ ఎమౌంట్ రూ 50 లక్షలు ఇచ్చే సమయంలో తెలంగాణా ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి ఏసిబి పోలీసులకు రెడ్ హ్యండెడ్ గా పట్టుబడ్డారు. తర్వాత జరిగిన పరిణామాలన్నీ అందరికీ తెలిసిందే.
ఇక మూడో ఫెయిల్యూర్ ఏమిటంటే, తాజాగా మంటలు పుట్టిస్తున్న జగన్ పై హత్యాయత్నం ఘటనపై స్పందన. మొన్న 25వ తేదీన హైదరాబాద్ రావటానికి జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం విమానాశ్రయం లాంజ్ లో వెయిట్ చేస్తున్నారు. సెల్ఫీ తీసుకుంటానని చెప్పి శ్రీనివాస్ అనే యువకుడు హఠాత్తుగా కోళ్ళ పందేల్లో వాడే కత్తితో జగన్ పై దాడి చేశాడు. ఏదో అదృష్టం కొద్ది గొంతులో దిగాల్సిన కత్తి ఎడమభుజం క్రింద దిగింది. దాంతో జగన్ కు ప్రాణాపాయం తప్పింది.
ఘటన జరిగిన అర్ధగంట నుండి జగన్ పై జరిగిన దాడి అంతా డ్రామా అంటూ చిత్రీకరించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. డిజిపి, మంత్రులు చివరకు చంద్రబాబు హత్యాయత్నమంతా పెద్ద డ్రామా అంటూ జనాలను నమ్మించేందుకు చాలా కష్టపడ్డారు. కాకపోతే బయటపడుతున్న సాక్ష్యాలన్నీ ఘటన వెనుక టిడిపి కుట్రుందనే విషయాన్ని బయటపెడుతున్నాయి. చివరకు కోర్టులో పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టుతో జగన్ పై జరిగింది హత్యాయత్నమే అని తేలిపోయింది. అంటే ఇది కూడా చంద్రబాబు ఫెయిల్యూర్ క్రిందే లెక్క. మొదటి ఫెయిల్యూర్ ను జనాలు పెద్దగా పట్టించుకోకపోయినా చివరి రెండు మాత్రం జనాలకు ఎప్పటికీ గుర్తుండిపోయేవే అనటంలో సందేహం లేదు.