తెలుగుదేశం పార్టీలో అంతర్గత రాజకీయాలు ఎలా వుంటాయో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా మహిళా నేతల పరిస్థితి మరింత దారుణం. సినీ నటి రోజా, తెలుగుదేశం పార్టీ కోసం అప్పట్లో చాలా కష్టపడ్డారు. టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా పని చేశారు. కానీ, ఎమ్మెల్యే అవ్వాలన్న ఆమె కోరికని టీడీపీ చంపేసింది. సొంత పార్టీనే ఆమెను ఓడించింది.
అలా రోజా, టీడీపీ నుంచి బయటకు వచ్చారు. జయప్రద కూడా సేమ్ అలానే టీడీపీ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. కవిత, యామిని.. చెప్పుకుంటూ పోతే ఈ లిస్టు చాలా చాలా పెద్దదే. ఇంతమందిని చూసి కూడా దివ్య వాణి తెలుసుకోకపోతే ఎలా.?
‘పార్టీ నన్ను తొక్కేయాలని చూసింది.. నా శవంతో రాజకీయాలు చేయాలని చూశారు..’ అంటూ వాపోయారు దివ్య వాణి తాజాగా ఓ ఇంటర్వ్యూలో. ఆ మరుసటి రోజు, తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు దివ్య వాణి.
ఏమయ్యిందో, ఇంతలోనే ఆ ట్వీట్‌ని ఆమె తొలగించారు. తాను పార్టీని వీడుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆమె వ్యాఖ్యానించారు. టీడీపీని దివ్య వాణి వీడతారన్న ప్రచారం నేపథ్యంలో ఆమెకు వైసీపీ నుంచి సానుభూతి వ్యక్తమయ్యింది.
అదే ఊపులో ఆమె టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్ళిపోయినా.. ఆమె రాజకీయ భవిష్యత్తు బావుండేదేమో.
ఇంతకీ, ఏ శక్తి దివ్య వాణి ట్వీట్ తొలగించేలా చేసినట్టు.? మహానాడులో మాట్లాడటానికి వీల్లేదంటూ దివ్య వాణిని రాజకీయంగా తొక్కేయాలనుకున్న టీడీపీ నేతలు ఎవరు.?