లోకేష్ బెయిల్ పిటీషన్ డిస్పోజ్.. అరెస్ట్ పై సీఐడీ కీలక వ్యాఖ్యలు!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు సుమారు నెల రోజులు పైబడి రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ ఉంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన తరుపు లాయర్లు బెయిల్, ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్ లపై మూడు కోర్టుల్లోనూ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే ఈ స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో నారా లోకేష్ కు తాజాగా ఏపీ హైకోర్టులో ఊరట లభించింది.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో ఆయన బెయిల్ పిటిషన్‌ ను ఏపీ ఉన్నత న్యాయస్థానం డిస్పోజ్ చేసింది. ఈ కేసులో లోకేష్ ను అసలు ముద్దాయిగా చూపలేదని సీఐడీ తరపు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. అందువల్ల లోకేష్ ను అరెస్టు చేయబోమని సీఐడీ తరపు న్యాయవాది.. హైకోర్టుకు చెప్పారు. దీంతో లోకేష్ పిటిషన్‌ ను హైకోర్టు డిస్పోజ్ చేసింది.

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ ను వేసిన సంగతి తెలిసిందే. తనను ఈ కేసులో అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరడంతో హైకోర్టు విచారణకు స్వీకరించింది. అయితే ఈ పిటిషన్‌ పై సీఐడీ తరపు లాయర్లు వివరణ ఇచ్చారు. ఆయనను అరెస్టు చేసే ఆలోచన ఇప్పుడు లేదని… అసలు ఈ కేసులో లోకేష్ పేరే చేర్చలేదని పేర్కొన్నారు. కాకపోతే… చంద్రబాబు కుటుంబీకులకు స్కాం ద్వారా అక్రమ డబ్బు అందిందనే విషయాన్ని మాత్రమే పేర్కొన్నట్లు తెలిపారు.

దీంతో… స్కిల్ డెవలప్ మెంట్ స్కాం వరకూ నారా లోకేష్ కు ప్రస్తుతానికి బిగ్ రిలీఫ్ అనే చెప్పుకోవాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… ఈ కేసులోనే ఒక వేళ లోకేష్ పేరు చేర్చాల్సి వస్తే అప్పుడు 41ఏ ప్రకారం నోటీసులిచ్చి, అంతా ప్రొసీజర్ ప్రకారం చేస్తామని మాత్రం సీఐడీ తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇదొకటే కండిషన్స్ అప్లై లా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

కాగా… స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును గతనెల 9న ఉదయం ఏపీ సీఐడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచీ ఆయన బయటకు రాలేదు. మరోపక్క స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో కర్త, కర్మ, క్రియా అన్నీ చంద్రబాబే అని ఏపీ సీఐడీ ముందునుంచీ వాదిస్తోంది.

ఈ నేపథ్యంలో అదే స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో నారా లోకేష్ ను ముద్దాయిగా చూపలేదని సీఐడీ, కోర్టుకు వివరించింది. మరోపక్క ఇదే స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు ఈ నెల 17కు వాయిదా వేసింది. అదేవిధంగా అంగళ్లు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటీషన్ పై తీర్పును శుక్రవారం వెల్లడిస్తామని తెలిపింది.