ఎన్టీఆర్ పాలన అలా.. చంద్రబాబు పాలన ఇలా.. జగన్ పాలన అలా ఉందా?

చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి నిన్నటికి 27 సంవత్సరాలు అయింది. ఈ 27 సంవత్సరాలలో 14 సంవత్సరాల పాటు చంద్రబాబు సీఎంగా పని చేశారు. అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఇటు విభజిత ఆంధ్రప్రదేశ్ కు సీఎంగా పని చేసి చంద్రబాబు అరుదైన రికార్డ్ ను ఖాతాలో వేసుకున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ ఈ సందర్భంగా సోషల్ మీడియాలో సీనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు, జగన్ పాలన గురించి ప్రస్తావించడం వైరల్ అవుతోంది.

ఆ పోస్ట్ లో సీనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు పాలన గురించి పాజిటివ్ గా ఉండగా జగన్ పాలన గురించి మాత్రం నెగిటివ్ గా ఉండటం గమనార్హం. ఆ పోస్ట్ లో సీనియర్ ఎన్టీఆర్ పాలన సంక్షేమ పథకాలకు నాంది పలికిందని, పేదల జీవితాలలో పెను మార్పులకు కారణమైందని, బడుగుల ఎదుగుదలకు అవకాశాలను కల్పించిందని, తెలుగుజాతికి ఆత్మగౌరవం తెచ్చిపెట్టిందని పేర్కొన్నారు.

తెలుగుదేశం మహిళలకు సమాన హక్కులను కల్పించిందని అందులో చెప్పుకొచ్చారు. చంద్రబాబు పాలన అభివృద్ధికి నిర్వచనమని, సంస్కరణలకు శ్రీకారమని, సాంకేతిక ఫలాలు పేదలకు అందాయని, లక్షలాది ఐటీ ఉద్యోగాలు వచ్చాయని, తెలుగు ప్రజలకు ఆత్మవిశ్వాసం కలిగిందని, సామాన్యుల కలలకు రెక్కలు తొడిగిందని పేర్కొన్నారు. 2019 మే 30వ తేదీన జగన్ విధ్వంసకర పాలన మొదలైందని పోస్ట్ లో చెప్పుకొచ్చారు.

జగన్ పాలన గురించి పాజిటివ్ గా ఒక్క పాయింట్ కూడా చెప్పలేదంటే ఈ పోస్ట్ ఉద్దేశం ఏంటో అర్థమవుతుంది. చంద్రబాబు తమ పార్టీ గురించి గొప్పగా ప్రచారం చేసుకోగా జగన్ పాలన మాత్రం దారుణంగా ఉందని టీడీపీ ట్విట్టర్ పోస్ట్ ప్రజలకు అభిప్రాయం కలిగిస్తోంది. ఆ పోస్ట్ కు స్పందనగా 2024 ఎన్నికల ఫలితాలే జగన్ పాలన ఏ విధంగా ఉందో ప్రజలకు తెలిసేలా చేస్తాయని జగన్ అభిమానులలో కొందరు కామెంట్లు చేస్తున్నారు.