చంద్రబాబునాయుడుకు ధర్మాబాద్ కోర్టు పెద్ద షాకిచ్చింది. వ్యక్తిగత మినహాయింపు కోరుతూ, తనపై జారీ అయిన నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంటు రీకాల్ చేయాలని కోరుతూ చంద్రబాబు తరపు లాయర్లు వేసిన పిటీషన్ ను కోర్టు కొట్టేసింది. ఎటువంటి అనుమతి లేకుండానే బాబ్లి ప్రాజెక్టు సైట్ లోకి ప్రవేశించిన కారణంగా చంద్రబాబు అండ్ కోను 2010లో మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసిన విషయం అందరికీ తెలిసిందే. మూడు రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో తిప్పి తర్వాత బెయిల్ పై విడుదల చేశారు.
తర్వాత ఆ కేసు గురించి ఎవరూ పట్టించుకోలేదు. అయితే తెలంగాణాలో అందరూ ముందస్తు ఎన్నికల హడావుడిలో ఉన్న సమయంలో ధర్మాబాద్ కోర్టు నుండి చంద్రబాబుకు వారం క్రితం నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంటు జారీ అయ్యింది. దాంతో తెలుగు రాష్ట్రాల్లో అది ఓ సంచలనమైంది. ఆ కేసు వాయిదా ఈరోజు అంటే 21వ తేదీ ఉంది కాబట్టి కచ్చితంగా హాజరుకావాలంటూ కోర్టు చంద్రబాబును ఆదేశించింది. ఆ విషయమై చంద్రబాబు చాలామంది లాయర్లను, న్యాయనిపుణులను కూడా సంప్రదించిన తర్వాత వ్యక్తిగతంగా హాజరవ్వాలని నిర్ణయించుకున్నారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, 22వ తేదీన చంద్రబాబు అమెరికా పర్యటకు బయలుదేరాలి. కోర్టుకు ఈరోజు వ్యక్తిగతంగా హాజరైనపుడు ఏదైనా జరగరానికి జరిగితే ఇబ్బందులో పడతామన్న ఉద్దేశంతో చివరి నిముషంలో తనకు బదులుగా లాయర్లను పంపారు. చంద్రబాబు తరపు లాయర్లు సుబ్బారావు, హన్మతరావులు కోర్టుకు హాజరయ్యారు. కేసు విచారణ నుండి చంద్రబాబును వ్యక్తిగతంగా మినహాయించాలని, జారీ అయిన నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంటును ఉపసంహరించుకోవాలంటూ పిటీషన్ వేశారు.
అయితే వారి పిటీషన్ ను కోర్టు కొట్టేసింది. కేసు విచారణ నుండి చంద్రబాబుకు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వటం కుదరదని తేల్చిచెప్పేసింది. అలాగే నాన్ బెయిలబుల్ వారెంటును ఉపసంహరించుకునేది లేదని కూడా స్పష్టంగా చెప్పింది. వచ్చే నెల 15వ తేదీకి కేసు విచారణను వాయిదా వేసిన కోర్టు ఆరోజు చంద్రబాబు కోర్టుకు తప్పకుండా హాజరవ్వాల్సిందేనంటూ ఆదేశించింది. అయితే ఇదే కేసులో నోటీసులు అందుకున్న తెలంగాణా నేతలు గంగుల కమలాకర్, ప్రకాష్ గౌడ్, కెఎస్ రత్నం మాత్రం ఈరోజు కోర్టులో హాజరవ్వటంతో బెయిల్ ఇచ్చింది. కాబట్టి కోర్టు ఆదేశాల ప్రకారం చంద్రబాబు వచ్చే నెల 15వ తేదీన ధర్మాబాద్ కోర్టుకు హాజరవ్వక తప్పదనే చెప్పాలి.