కాకినాడ పోర్టు ప్రస్తుతం రేషన్ బియ్యం అక్రమ రవాణా హబ్‌గా మారినట్లు ఆరోపణలు పెరుగుతున్న నేపథ్యంలో, ఏపీ కూటమి సర్కారు ఆ దందాకు ఎండ్ కార్డ్ పెట్టేందుకు సిద్ధమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ విషయంలో సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా పూర్తిగా ఆపడానికి ప్రత్యేక భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కాకినాడ పోర్టు పరిసరాల్లో 24 గంటల నిఘా కల్పించేందుకు ఓ సీనియర్ ఐపీఎస్ అధికారిని చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా నియమించబోతున్నారు. ఈ ప్రత్యేక భద్రతా బృందం, స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ పోర్టులో ఏ అక్రమ చర్యలు జరుగుతున్నా వెంటనే పట్టుకోగలుగుతుంది. అదనంగా, పోర్టులో సీసీ కెమెరా వ్యవస్థను మరింత పటిష్ఠం చేయడం ద్వారా అన్ని ప్రదేశాలు కవర్ చేయాలని భావిస్తున్నారు.
రేషన్ బియ్యం ఎక్కడ నుంచి పోర్టు వరకు చేరుతుందన్న అంశాన్ని గుర్తించేందుకు రెవెన్యూ, పోలీసు, సివిల్ సప్లై అధికారులు ప్రత్యేక బృందంగా పనిచేయనున్నారు. బియ్యం గోదాములలో జరిగే రీసైక్లింగ్, పాలిష్ వంటి దందాలను ఆపేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఆచూకీలు లభించగానే సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసి, కోర్టులో సరైన ఆధారాలతో వాదనలు వినిపించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన “సీజ్ ది షిప్” వ్యాఖ్యలు వైరల్ అవడంతో, రేషన్ బియ్యం స్మగ్లింగ్‌పై దృష్టి మరింతగా పెరిగింది. కస్టమ్స్ అధికారుల ఆధీనంలో ఉన్న షిప్‌లు, వాటి లోడింగ్ ప్రక్రియలపై కూడా నిఘా పెంచారు. గ్రామీణ స్థాయి నుంచి పోర్టు వరకు పర్యవేక్షణతో రేషన్ బియ్యం మాఫియాకు ఎండ్ కార్డ్ వేయాలని ప్రభుత్వం ఫిక్స్ అయింది. ఈ చర్యలతో రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారం మున్ముందు రాజకీయంగా మరింత రగులుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.