పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అల్లు అర్జున్ వ్యవహారంపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఫ్యాన్స్ ఉత్సాహం కారణంగా ఇలా జరిగినా, బాధ్యత చిత్ర యూనిట్ మీదే పడుతుందని తెలిపారు. అలాగే వ్యవహారం గోటితో పోయేదానికి గొడ్డలి వరకూ తెచ్చారని అన్నారు.
పవన్ మాట్లాడుతూ, ‘‘సినిమా అనేది ఒక టీమ్ వర్క్. ఇలాంటి ఘటనలు జరిగితే, హీరోతో పాటు యూనిట్ మొత్తం బాధిత కుటుంబాలకు మద్దతుగా నిలవాలి. ఇలాంటి బాధాకర సంఘటనలకు సంబంధించిన బాధ్యతను కేవలం ఒక వ్యక్తిపై నెట్టేయడం సరికాదు’’ అని పేర్కొన్నారు. మహిళ మరణంపై బాధ వ్యక్తం చేసిన పవన్, హీరోలు థియేటర్లకు వెళ్లడం వల్ల గందరగోళం పెరిగే అవకాశం ఉంటుందని అన్నారు.
అలాగే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తూ, ‘‘రేవంత్ రెడ్డి డైనమిక్ లీడర్. సినిమా రంగానికి ఆయన చేసిన సహకారం అభినందనీయమైంది. బెనిఫిట్ షోలకు అధిక ధరలకు అనుమతులు ఇచ్చినప్పటికీ, చట్ట ప్రకారమే వ్యవహారం జరిగిందని నేను భావిస్తున్నాను’’ అని స్పష్టం చేశారు. అయితే, తొక్కిసలాట ఘటన తర్వాత యూనిట్ బాధిత కుటుంబాలను నేరుగా కలవాల్సిందని సూచించారు.
ఇదే సందర్భంలో, వైసీపీ నేత పేర్ని నాని గోదాం కేసుపై మీడియా ప్రశ్నలకు స్పందించిన పవన్, ‘‘చట్టం ప్రకారం ఎవరికైనా తప్పు జరిగితే చర్యలు తీసుకోవాలి. ఇది మహిళా, పురుష భేదం కాకుండా జరుగుతుంది’’ అని అభిప్రాయపడ్డారు. మొత్తం మీద, అల్లు అర్జున్ కేసుపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.