కడప కార్పొరేషన్ హైస్కూల్ తల్లిదండ్రుల-ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యకు, ఉపాధ్యాయులకు ఉన్న ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్రను కీర్తిస్తూ వారి సేవలకు గౌరవం ఇవ్వాలని ఆయన సూచించారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “సినిమాల్లో నటించే నటులు మాత్రమే హీరోలు కాదు, నిజమైన హీరోలు ఉపాధ్యాయులే. వారు సమాజానికి విలువలు నేర్పి, భవిష్యత్ తరాల్ని గడిచే ప్రాణులుగా మార్చుతారు. సింహం గడ్డం గీసుకోదు.. నేను గీసుకుంటాను అనే డైలాగ్‌లు రీరికార్డింగ్ వల్లే అద్భుతంగా కనిపిస్తాయి. కానీ ఉపాధ్యాయులు, కార్గిల్ వీరులు నిజ జీవితంలో రీరికార్డింగ్ అవసరం లేకుండా నిజమైన హీరోలుగా పనిచేస్తారు” అని అభిప్రాయపడ్డారు.
అధ్యాపకుల జీతభత్యాలు పెంచి, వారికి మరింత ప్రోత్సాహం కల్పించాలి అనేది తన కోరిక అని పవన్ అన్నారు. దేశం బాగు పడాలంటే విద్య రంగంపై పెట్టుబడులు పెట్టడం అత్యవసరమని పేర్కొన్నారు. కేబినెట్‌లో విద్యార్థుల పోషకాహారం, ఉపాధ్యాయుల శ్రేయస్సు గురించి చర్చిస్తానని హామీ ఇచ్చారు. సమాజంలో పెరుగుతున్న సైబర్ క్రైమ్ పై ఆందోళన వ్యక్తం చేస్తూ, సోషల్ మీడియా వినియోగంపై కఠినమైన నియంత్రణలు అవసరమని అభిప్రాయపడ్డారు.
“విద్యార్థులు చిన్నప్పటి నుంచే సహాయగుణం అలవాటు చేసుకోవాలి. విలువలతో కూడిన విద్య మాత్రమే దేశాన్ని బలంగా నిలుపుతుంది. ఉపాధ్యాయులను గౌరవించడం ద్వారా సమాజానికి ఉత్తమ మార్గదర్శకత్వం లభిస్తుంది. నేటి యువత దృఢమైన విలువలతో ఎదగాలి” అంటూ పవన్ కళ్యాణ్ తన ప్రసంగాన్ని ముగించారు.