సినీ నటుడు నందమూరి తారకరత్న తీవ్ర గుండెపోటుతో కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. కుప్పంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభించగా, ఆ యాత్రలో పాల్గొనేందుకు వచ్చి, తారకరత్న గుండెపోటుకి గురయ్యాడు. కుప్పంలోనే అప్పటికప్పుడు అవసరమైన వైద్య చికిత్సను తారకరత్నకు అందించారు. అయినా ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం మెరుగు పడలేదు. అర్థరాత్రి సమయంలో తారకరత్నను బెంగళూరుకు తరలించారు. బెంగళూరు నుంచి వైద్య నిపుణుల్ని రప్పించి, వారి సూచన మేరకు తారకరత్నను తరలించడం జరిగింది.
ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో ఎక్మో ద్వారా తారక రత్నకు లైఫ్ సపోర్ట్ అందిస్తూ వైద్య చికిత్స కొనసాగిస్తున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితికి సంబంధించి హెల్త్ బులెటిన్ విడుదల చేవారు వైద్యులు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా వుందని ఆ బులెటిన్‌లో పేర్కొన్న వైద్యులు, తారకరత్నకు గుండె పోటు రావడం, ఆ తర్వాత అందించిన వైద్య చికిత్స తదితర వివరాల్నీ వివరంగా ప్రస్తావించారు.
అయితే, తారకరత్నను ముందే బెంగళూరుకి తరలించి వుంటే బావుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎయిర్ అంబులెన్స్ వినియోగించి అయినా తారకరత్నను బెంగళూరుకి హుటాహుటిన తరలించి వుంటే, ఈపాటికే కోలుకునేందుకు ఆస్కారం వుండేదన్న అభిప్రాయాల్ని ఆయన అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.