అవును చంద్రబాబునాయుడుకు ఫిరాయింపు మంత్రి ఆదినారాయణరెడ్డి అడ్డం తిరిగారు. కడప ఎంపి అభ్యర్ధిగా పోటీ చేసే విషయంలో చంద్రబాబు దగ్గర ముందు ఒప్పుకున్న ఫిరాయింపు మంత్రి ఇపుడు అడ్డం తిరిగారు. ఓడిపోయే సీటులో ఎవరు పోటీ చేస్తారని తన మద్దతుదారుల దగ్గర బాహాటంగానే మండిపడుతున్నారట. కొద్ది రోజుల క్రితం కడప ఎంపిగా ఆది నారాయణరెడ్డి పోటీ చేసేట్లు, జమ్మలమడుగు అసెంబ్లీకి ఎంఎల్సీ రామసుబ్బారెడ్డి పోటీ చేసేట్లు చంద్రబాబు దగ్గర ఒప్పందం కుదిరింది. ఒకవేళ ఎంపిగా ఓడిపోతే మళ్ళీ ఎంఎల్సీగా అవకాశం ఇస్తానని చంద్రబాబు బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారట.
అయితే, పంచాయితీ అయిపోయిన తర్వాత జిల్లాకు తిరిగొచ్చిన ఫిరాయింపు మంత్రి కడప ఎంపిగా పోటీ చేసేది లేదని స్పష్టం చేశారట. మంత్రి ఎందుకు అడ్డం తిరిగారంటే కడప ఎంపిగా టిడిపి గెలిచేది కలలోని మాట. ఓడిపోయే సీటులో తనను పోటీ చేయించేందుకు ప్లాన్ వేస్తున్నారంటూ చంద్రబాబుపై మండిపోతున్నారు. అంటే జమ్మలమడుగులో పోటీ చేస్తే గెలుస్తారని కాదులేండి. ఎంతైనా చిరకాల ప్రత్యర్ధి కదా ? అందుకనే రామసుబ్బారెడ్డి కోసం జమ్మలమడుగు అసెంబ్లీని వదులు కోవటానికి ఫిరాయింపు మంత్రి సిద్ధంగా లేరు. దాంతో జమ్మలమడుగు పంచాయితీ చంద్రబాబు మెడకు చుట్టుకుంటోంది.
నెలల తరబడి ఈ పంచాయితీ సాగుతున్నదే కానీ ఎంతకీ తెగటం లేదు. అందుకు చంద్రబాబే కారణమని చెప్పాలి. బద్ద శతృవులైన రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డిలను ఒకే ఒరలో ఉంచాలని అనుకోవటమే చంద్రబాబు చేసిన తప్పు. జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టాలన్న క్షణికావేశంలో ఫిరాయింపులను ప్రోత్సహించారే కానీ చివరకు అదే భస్మాసుర హస్తమవుతుందని అప్పుడు ఊహించలేదు. తీరా ఎన్నికలు దగ్గర పడుతున్న నేపధ్యంలో జమ్మలమడుగు నియోజకవర్గాల్లాంటి వాటిలో పంచాయితీలు ఎంతటి తెగటం లేదు. కడప ఎంపిగా పోటీ చేయటానికి పై ఇద్దరు నేతలు వెనకాడుతున్న నేపధ్యంలో ప్రత్యామ్నాయంగా మరే నేత కూడా దొరకటం లేదు. ఎన్ని హామీలిచ్చినా పోటీకి ఎవరూ ముందుకు రావటం లేదంటేనే పార్టీ పరిస్ధితి ఎంత దయనీయంగా ఉందో అర్ధమైపోతోంది.