ఎన్టీఆర్ విషయంలో బాబుకు పురందేశ్వరి చెక్!

ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఎన్టీఆర్ నామజమం మరోసారి తెరపైకి వచ్చింది. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు ఎన్టీఆర్ విగ్రాహానికి పాలాభిషేకాలు, టీడీపీ మహానాడులో ఎన్టీఆర్ గురించి చంద్రబాబు ఊకదంపుడు ఉపన్యాశాలు, ఎన్టీఆర్ కు భారతరత్న డిమాండ్ వంటివి తెరపైకి రావడం అత్యంత సాధారణమైన విషయం! అయితే ఈసారి ఎన్టీఆర్ విషయంలో బాబుకు ఇంటిపోరు తప్పేలా లేదని తెలుస్తోంది!

ఎన్నికలు సమీపిస్తున్నాయ్యంటే ఎన్టీఆర్ గొప్పవాడని, ఆయనకు భారతరత్న ఇవ్వాలనేది టీడీపీ డిమాండ్ అని చెబుతుంటారు చంద్రబాబు. ప్రతిపక్షంలో ఉన్నా.. కేంద్రంలో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నా ఇదే పాట పాడుతుంటారు బాబు. మనసులో లేకో ఏమో కానీ… అవకాశం ఉన్నా కూడా ఆ పని పూర్తి చేయలేదని చెబుతుంటారు. ఆ సంగతి అలా ఉంటే… ఇప్పుడు పురందేశ్వరి రూపంలో చంద్రబాబుకు కొత్త టెన్షన్ నెలకొందని తెలుస్తోంది.

అవును… ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయంటే చంద్రబాబుకు ఎన్టీఆర్‌ పై వల్లమాలిన ప్రేమ కనబరుస్తుంటారు. అలాంటి ఎన్టీఆర్‌ పేరుపై పేటెంట్ హక్కు కోసం తాజాగా పోటీ మొదలైంది. అది కూడా ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి నుండే కావటం ఆసక్తిగా మారింది. దీంతో… ఈసారి ఎన్టీఆర్ పేటెంట్ హక్కు విషయంలో బాబుకు పూర్తి వాటా దక్కదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఏపీ బీజేపీ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న పురందేశ్వరి కి ఇప్పుడు బీజేపీ అధిష్టాణం ఈ మేరకు కమ్మ సామాజిక వర్గ ఓట్లను, ఎన్టీఆర్ అభిమానుల ఓట్లను ఆకర్షించే పనిని అప్పగించారని తెలుస్తోంది. దీంతో రంగంలోకి దిగిన పురందేశ్వరి తాజాగా ఎన్ టీఆర్ గురించి బీజేపీ సభల్లో ప్రస్తావించడం మొదలుపెట్టారు. తాను ఎన్ టీఆర్ కుమార్తెను అని నొక్కి వక్కానించడం మొదలుపెట్టారని తెలుస్తుంది.

తాజాగా ప్రొద్దుటూరులో బీజేపీ నేతలు, కార్యకర్తల సమావేశం జరిగింది. తొందరలోనే ఎన్నికల ప్రచారాన్ని తాను రాయలసీమ నుండే ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా తన తండ్రి, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ కూడా ఎన్నికల ప్రచారాన్ని ఎప్పుడూ రాయలసీమ నుండే మొదలుపెట్టేవార‌నే విషయాన్ని గుర్తు చేశారు. తండ్రిబాటలోనే తాను కూడా నడుస్తానని ప్రకటించారు. తన తండ్రి అమలు చేసిన సంక్షేమ పథకాలను కూడా పురందేశ్వరి ఈ సందర్భంగా గుర్తు చేశారు.

దీంతో బీజేపీ అధ్యక్షురాలి హోదాలో పురందేశ్వరి తన తండ్రి ఎన్టీఆర్‌ పేరును పదేపదే ప్రస్తావించేట్లుగానే ఉన్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ పరిపాలనలో తెచ్చిన సంస్కరణలు, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రస్తావించటం ద్వారా బీజేపీ కూడా ఎన్టీఆర్‌ ను అనుసరిస్తుందనే కలరింగ్ ఇవ్వాలని అనుకుంటున్నట్లున్నారు. మరిదే జరిగితే చంద్రబాబుకు ఇబ్బందులు మొదలైనట్లే అనుకోవాలి.

ఇంతకాలమంటే చంద్రబాబు, బాలకృష్ణ కారణంగా ఎన్టీఆర్‌ పేరు వాడుకునేందుకు ఇతర పార్టీలకు హక్కు లేకుండా పోయింది. అయితే ఊహించని రీతిలో ఎన్టీఆర్‌ కూతురు పురందేశ్వరి బీజేపీ అధ్యక్షురాలయ్యారు. ఎన్టీఆర్ పేరును ఫుల్ గా వాడేసే పనికి పూనుకున్నారు. దీంతో… చంద్రబాబు – పురందేశ్వరి మధ్య ఎన్టీఆర్‌ పేరుపై పేటెంట్ హక్కుల కోసం పోరాటం మొదలైనట్లే అని అంటున్నారు పరిశీలకులు.

కాగా… జూనియర్ ఎన్టీఆర్ ని కూడా ఇప్పటికే టీడీపీ పూర్తిగా దూరం చేసుకున్న సంగతి తెలిసిందే. లోకేష్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జూనియర్ ని పక్కనపెట్టారని, వాడుకుని వదిలేశారని కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే!