ఏపీ రాజకీయాల్లో దగ్గుబాటి ఫ్యామిలీకి మంచి గుర్తింపు ఉంది. సీనియర్ నాయకుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, దగ్గుబాటి పురందేశ్వరి గురించి తెలియని వారుండరు తెలుగు రాష్ట్రాల్లో. దగ్గుబాటి ఫ్యామిలీ తొలినాళ్లలో టీడీపీలోనే ఉంది. అనంతరం జరిగిన కొన్ని కుటుంబ పరిణామాల రీత్యా వారు టీడీపీకి దూరం అయ్యారు. తర్వాత వారి పొలిటికల్ జర్నీ కాంగ్రెస్ పార్టీలో కొనసాగింది.
రాష్ట్ర విభజన అనంతరం దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇక ఆయన సతీమణి పురందేశ్వరి మాత్రం బీజేపీలో చేరి అందులోనే కొనసాగుతున్నారు. అయితే గత కొంతకాలంగా వీరి వారసుడి పొలిటికల్ ఎంట్రీపై అనేక కధనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారి తనయుడు దగ్గుబాటి హితేష్ చెంచురామ్ ఏ పార్టీలో చేరనున్నారు అనే అంశంపై క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం కింద ఉంది చదవండి.
దగ్గుబాటి, నారా వారి కుటుంబాల మధ్య అంతర్గత విబేధాలున్నప్పటికీ నారా లోకేష్ తో దగ్గుబాటి హితేష్ సన్నిహితంగానే నడుచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నుండి ఎన్నికల బరిలోకి దిగుతాడు అనుకున్నారు. కానీ తన సొంత నియోజకవర్గం పర్చూరు సీటుపై ఆశలు పెట్టుకున్నాడు హితేష్. అయితే ఆ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యేకే కేటాయించాలని అధిష్టానం డిసైడ్ అవడంతో హితేష్ కి ఛాన్స్ దక్కలేదు. దీంతో ఆయన వేరే పార్టీ నుండి అయినా అదే నియోజకవర్గం నుండి పోటీ చేయాలనీ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో తన తల్లి కొనసాగుతోన్న బీజేపీలో చేరి ఛాన్స్ తీసుకోదల్చుకోలేదట. ఎందుకంటే బీజేపీపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఇక తన ముందు ఉన్న మరో రెండు పార్టీలు జనసేన, వైసీపీ. జనసేన కొత్త పార్టీ కాబట్టి రిస్క్ తీసుకోవడం ఎందుకని వైసీపీవైపే మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే చాల రోజులుగా పురందేశ్వరి వైసీపీలో చేరుతారు అంటూ టాక్ నడుస్తోంది. పర్చూరు నియోజకవర్గం టికెట్ పై ఇప్పటికే పలువురు వైసీపీ ముఖ్య నేతలతో చర్చలు కూడా పూర్తయ్యాయని సమాచారం. మరి తన కొడుకుతోపాటు ఆమె కూడా వైసీపీ లో చేరతారా లేదా అనేది వేచి చూడాలి.