ఎప్పటి నుండో అనుకుంటున్నట్లుగానే దగ్గుబాటి కుంటుంబంలో తండ్రి, కొడుకులు వైసిపిలో చేరారు. లోటస్ పాండులోని నివాసంలొ జగన్మోహన్ రెడ్డిని దగ్గుబాటి వెంకటేశ్వరరావు, కొడుకు హితేష్ చెంచురామ్ దాదాపు గంటపాటు సమావేశమయ్యారు. పార్టీలో చేరాలన్న తమ అభిమతాన్ని వెంకటేశ్వరరావు చెప్పగా జగన్ కూడా సాధరంగా ఆహ్వానించారు. ప్రకాశం జిల్లాలోని పర్చూరు నియోజకవర్గం నుండి రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలని చెంచురామ్ నిర్ణయించుకున్నారు. అందుకు వైసిపియే సరైన వేదికగా ఎంచుకున్నారు.
చంద్రబాబునాయుడుతో ఉన్న రాజకీయ వైరం కారణంగా కొడుకును వైసిపిలోనే చేర్చాలని దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురంధేశ్వరి నిర్ణయించుకున్నారు. పురంధేశ్వరి బిజెపిలో యాక్టివ్ గానే ఉన్నా ఏదో నెట్టుకొచ్చేస్తున్నారు. బిజెపికి రాష్ట్రంలో ఉన్న బలమెంతో ఆమెకు తెలీంది కాదు. అందుకనే ఈరోజో రేపో ఆమె కూడా బిజెపిలో నుండి బయటకు వచ్చేస్తారనే ప్రచారం ఊపందుకుంటోంది. భర్త, కొడుకు వైసిపిలో ఉండగా ఆమె మాత్రం బిజెపిలో ఉండి చేసేదేమీ లేదు. పైగా బిజెపిలో ఉంటే నేతలకు రాజకీయంగా భవిష్యత్తు కూడా లేదు. కాబట్టే ఆమె కూడా బయటకు వచ్చేస్తారని ఎప్పటి నుండో ప్రచారం జరుగుతోంది.
అదే విషయాన్ని పరోక్షంగా వెంకటేశ్వరరావు కూడా అంగీకరించారు. ప్రస్తుతానికి పురంధేశ్వరి బిజెపిలో ఉన్నారని అయితే, కొడుకు రాజకీయాన్ని దృష్టిలో ఉంచుకుని అవసరమైతే ఆమె అసలు రాజకీయాలకే దూరంగా ఉండాలని కూడా నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అంటే తొందరలోనే పురంధేశ్వరి బిజెపికి రామ్ రామ్ చెప్పటం ఖాయమని తేలిపోయింది. అంత యాక్టివ్ గా ఉన్న పురంధేశ్వరి రాజకీయాలకు దూరంగా ఉండగలరా ? ఇపుడిదే ప్రశ్న అందరిలోను వినబడుతోంది.
ముందు బిజెపికి రాజీనామా చేసేసి తర్వాత పురంధేశ్వరి వైసిపిలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. పురంధేశ్వరికి ఒంగోలు పార్లమెంటులో పోటీ చేసే అవకాశాన్ని కూడా కొట్టి పారేయలేం. ఎందుకంటే, లోక్ సభకు పురంధేశ్వరి పోటీ చేస్తే అదే పరిధిలోని పర్చూరులో చెంచురామ్ పోటీ చేస్తే ఇద్దరికీ ఉపయోగం. బహుశా దాన్ని దృష్టిలో పెట్టుకునే జగన్ కూడా భేటీలో పురంధేశ్వరి విషయాన్ని కూడా ప్రస్తావించారట. వెంకటేశ్వరరావు, చెంచురామ్ పార్టీలో చేరే ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి తొందరలో పురంధేశ్వరి ఎంట్రీకి ముహూర్తం కూడా ఖాయమవుతుదేమో ?