బాలయ్య ఉవాచ: తప్పంతా నాన్న ఎన్టీయార్‌దే.! బావ చంద్రబాబుది తప్పే కాదు.!

‘అన్‌స్టాపబుల్’ టాక్ షో, రెండో సీజన్ మొదటి ఎపిసోడ్ స్వర్గీయ నందమూరి తారక రామారావుని తీవ్రంగా అవమానించడానికేనా.? ఔననే అనుకోవాలేమో. ఎపిసోడ్ ప్రారంభంలో ఆ మహానుభావుడ్ని పొగిడి,  ఎపిసోడ్ చివర్న కూడా పొగిడి.. మధ్యలో మాత్రం, స్వర్గీయ ఎన్టీయార్‌ని తీవ్రంగా అవమానించారు టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు, ‘అన్‌స్టాపబుల్’ హోస్ట్ నందమూరి బాలకృష్ణ.

ఈ ఎపిసోడ్ గెస్ట్ అయిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, స్వర్గీయ ఎన్టీయార్ విషయంలో చేసిన వ్యాఖ్యల సంగతి సరే సరి.! నిజానికి, చంద్రబాబు కాస్త బెటర్.. బాలయ్యే హద్దులు దాటి, తండ్రిని అవమానించారు.తప్పంతా ఎన్టీయార్ చేశారా.? కన్‌ఫ్యూజన్ ఎవరికి.?

ఆనాటి ఆ వెన్నుపోటు ఘటనలో తన తప్పేమీ లేదని చంద్రబాబు, బాలయ్య నుంచి క్లీన్ సర్టిఫికెట్ తీసుకున్నారు. అది కూడా, ఒకటికి రెండు సార్లు బాలయ్యను ప్రశ్నించి మరీ ‘తప్పు లేదు, తప్పు కాదు’ అని తనక్కావాల్సిన సమాధానం రాబట్టుకున్నారు చంద్రబాబు.

కానీ, ఈ క్రమంలో బాలయ్య మాత్రం, ‘తప్పంతా ఆయనదే.. ఆయనే కన్‌ఫ్యూజన్‌లో వున్నారు..’ అంటూ జన్మనిచ్చిన తండ్రి ఎన్టీయార్ మీద నిందారోపణలు చేశారు. ఏ కొడుకు అయినా, తన తండ్రి విషయంలో ఇలా మాట్లాడగలుగుతారా.? బావ మెప్పు కోసం, చివరికి తండ్రిని ‘తప్పుడు మనిషి’గా చూపే ప్రయత్నం చేయడం ఎంతవరకు సబబు.?

రాజకీయం అంటేనే అంత. రాజకీయం ఏమైనా మాట్లాడిస్తుంది. రాజకీయం ఏమైనా చేయిస్తుంది. ‘నందమూరి వంశం’ అని మీసం మెలేసి, తొడ కొడతారు చంద్రబాబు. ఆ నందమూరి వంశానికి యుగపరుషుడు ఎన్టీయార్. చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకోవడమే కాదు, ఆ చెట్టుని గౌరవించడం కూడా బాలయ్య నేర్చుకోవాలి.