‘సైకిల్ రావాలి..’ అనడానికి బదులు.. పదే పదే ‘సైకిల్ పోవాల’ అంటున్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ ముఖ్య నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ.. నారా లోకేష్.!
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీని దాదాపుగా పాతాళానికి తెచ్చేశారు. దాన్ని మరింతగా నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టున్నారు ఆయనగారి పుత్ర రత్నం నారా లోకేష్. మాట్లాడేటప్పుడు.. ఆ మాట మీద నారా లోకేష్‌కి అదుపు వుండదు.
రాజకీయాల్లో ఎవరైనా మాట జారడం తప్పేమీ కాదు. అరుదుగా అయినా, నేతలకు తప్పదది. కొన్నాళ్ళ క్రితం ఓ కార్యక్రమం సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రానికి ఓ మహిళ ముఖ్యమంత్రిగా వున్నారంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెలవిచ్చారు. మహిళా హోంమంత్రి అనాల్సింది పోయి.. మహిళా ముఖ్యమంత్రి అనేశారాయన. అప్పట్లో అదో పెద్ద చర్చనీయాంశమయ్యింది.
ఇక, లోకేష్ విషయానికొస్తే.. పదే పదే మాట జారుతుంటారు. లోకేష్ మాత్రమే కాదు.. చంద్రబాబు కూడా ఈ మధ్య మాట జారుగుతున్నారు. టీడీపీని పంపెయ్యాలనడమేంటి.? తండ్రీ కొడుకులిద్దరూ.. ఇలా మాట మీద అదుపు లేకుండా వ్యవహరిస్తోంటే, ‘ఇదేం ఖర్మరా బాబూ..’ అనుకుంటున్నారు తెలుగు తమ్ముళ్ళు.
లక్షలు కాదు.. కోట్లు ఖర్చు చేసి మరీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నారా లోకేష్‌తో సుదీర్ఘ పాదయాత్ర చేయిస్తున్నారు చంద్రబాబు. ఈ పాదయాత్రకు జనాన్ని తరలించడమే అతి పెద్ద టాస్క్. వచ్చిన జనాన్ని ఉర్రూతలూగించేలా లోకేష్ ప్రసంగాలుండాలి. చిత్రంగా, జనం నిట్టూర్చేలా లోకేష్ ప్రసంగాలుంటున్నాయి.
దానికి తోడు, ఈ ‘సైకిల్ పోవాలి’ అంటూ నినదిస్తుండడంతో, టీడీపీ కార్యకర్తలే నారా లోకేష్ పాదయాత్రకు హాజరు కావాలంటే భయపడే పరిస్థితి.