జగన్ పేరుతో డబ్బు వసూళ్ళా ?

సైబర్ ముఠా దెబ్బ చివరకు వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని కూడా వదలలేదు. జగన్ పేరుతో ఫోన్లు చేయటం, డబ్బులు డిమాండ్ చేయటం, పార్టీ పరంగా ఆదేశాలు జారీ చేయటం లాంటివి రెగ్యులర్ గా జరుగుతుండటంతో పార్టీలో గందరగోళం మొదలైంది. దాంతో లబోదిబోమంటూ పలువురు ఎంఎల్ఏలు, మాజీ ఎంఎల్ఏలు పార్టీ కార్యాలయానికి వచ్చి మొత్తుకోవటంతో విషయం బయటపడింది. తమపై సైబర్ దాడి జరిగుతోందని, సైబర్ నేరగాళ్ళే జగన్ పేరుతో చాలామంది నేతలకు ఫోన్లు చేస్తున్నారని గుర్తించిన పార్టీ కేంద్ర కార్యాలయం నేతలు సైబర్ పోలిస్టేషన్లో ఫిర్యాదు చేయటం గమనార్హం.

 

నేరగాళ్ళు చేస్తున్న ఫోన్ మాత్రం జగన్ పిఏదే అనటంలో సందేహం లేదు. కానీ ఫోన్ చేస్తున్నది మాత్రం ఏపి కాదు. మరి జగన్ పిఏ ఫోన్ నుండి నేతలకు ఫోన్లు ఎలా వెళుతున్నాయి ? జగన్ పిఏ నెంబర్ నుండి ఫోన్ వస్తోంది కాబట్టి వచ్చే ఆదేశాలు కూడా నిజమే అని నేతలు అనుకుంటున్నారు.  ఇంత జరుగుతున్నా ఆ విషయాలేవీ జగన్ కు కానీ పిఏకి కానీ లేమీ తెలీదు. మరి ఇదెలా సాధ్యమైంది ? ఇక్కడే నేరగాళ్ళు తెలివిగా ‘ స్పూఫింగ్ స్టాఫ్ వేర్’ ను వాడుతున్నట్లు నిపుణులు గుర్తించారు.

 

ఇంతకీ జరుగుతున్నదేమిటంటే ? ముందుగా నేరగాళ్ళు జగన్ పిఏ నెంబర్ ను సంపాదించారు.  ఇంటర్నెట్ లో దొరికే స్పూఫింగ్ సాఫ్ట్ వేర్ ద్వారా ఆ నెంబర్ ను క్లోన్ చేశారు. మామూలుగా జగన్ ఎవరితో మాట్లాడాలన్నా పిఏ నెంబర్ నుండే మాట్లాడుతారు. అందుకే పిఏ నెంబరే వైసిపి నేతల ఫోన్లలో ఫీడ్ అయ్యుంటుంది. పిఏ నెంబర్ నుండి ఎవరికి ఫోన్ వచ్చినా జగన్ కానీ లేకపోతే జగన్ తరపున పిఏ కానీ మాట్లాడుతారనే అనుకుంటారు. ఇప్పుడు కూడా అదే నెంబర్ నుండి ఫోన్ రాగానే సదరు నేత జగనే మాట్లాడుతున్నాడని అనుకుంటారు. ఫోన్లు జగన్ మాట్లాడుతూ తాను పాదయాత్రలో ఉన్న కారణంగా ఎక్కువ విషయాలు మాట్లాడలేనని చెబుతూ పలానా వాళ్ళు తన పేరుతో ఫోన్ చేస్తారని చెప్పి ఫోన్ పెట్టేస్తారు.

 

జగన్ చెప్పిన ఫలానా వాళ్ళు వెంటనే మరో నెంబర్ నుండి ఫోన్ చేసి మాట్లాడుతారు. అలా మాట్లాడేటప్పుడే అత్యవసరంగా డబ్బులు కావాలని విశాఖపట్నం విమానాశ్రయంలో ఫలానా వ్యక్తి ఉంటాడని జగన్ చెప్పినట్లుగా ఆయనకు హ్యాండోవర్ చేయాలని ఆదేశాలు ఇస్తారు. దాంతో నిజమే అనుకుని కొందరు డబ్బులు హ్యాండోవర్ చేసినట్లు సమాచారం. ఎన్నికల సమయం కదా వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల కోసం చాలామంది నేతలు తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నారు. అందుకనే జగన్ చెప్పారు కాబట్టి వెనకాముందు చూసుకోకుండా అడిగినంత డబ్బు అందచేస్తున్నారు. అయితే, ఎక్కడో ఎవరికో అనుమానం వచ్చి అదే విషయాన్ని జగన్ పిఏతో చెప్పారట. దాంతో వెంటనే అలర్టయిన పిఏ విషయాన్ని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో విషయం బయటపడింది.