తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీని అధికారం నుంచి దింపేందుకు ఏర్పాటైన మహా కూటమిలో లుకలుకలు మొదలయ్యాయి. కూటమి కోసం ముందుగానే ప్రయత్నాలు చేసిన సిపిఐ పార్టీలో మహా కూటమి పరిణామాలు చిచ్చు రేపాయి. ఆఫ్ట్రాల్ మూడు సీట్లు తీసుకుని కూటమిలో ఉండాలా అని పార్టీ లో కొందరు సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసినా ఆమాత్రం సీట్లు గెలవలేమా అని ప్రశ్నిస్తున్నారు. మగ్దూం భవన్ లో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం హాట్ హాట్ గా సాగింది. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.
మగ్దూం భవన్ లో సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం మధ్యాహ్నం 12 గంటలకు మొదలైంది. సమావేశంలో కూటమి సీట్ల కేటాయింపు అంశంపై వాడి వేడి చర్చ సాగినట్లు తెలుస్తోంది. ఆ మూడు సీట్లు తీసుకుని కూటమి భారాన్ని మోసే కంటే ఒంటరిగానే బరిలోకి దిగితే వచ్చే నష్టమేంటి అని కొందరు నేతలు డిమాండ్ చేసినట్లు చెబుతున్నారు.
సిపిఐ కి బలం ఉన్న స25 స్థానాల్లో పోటీ చేద్దామని కొందరు నేతలు వాదన వినిపించారు. మూడు సీట్లు మాత్రమే ఇస్తే కూటమి నుంచి బయటకు రావడమే ఉత్తమం అని మెజార్టీ నేతలు తమ అభిప్రాయాన్ని చెప్పినట్లు సమాచారం అందుతోంది.
ఇదిలా ఉంటే కూటమి సీట్ల కేటాయింపు ఏమాత్రం సబబుగా లేదని సీనియర్ నేత, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంభశివరావు సమావేశంలో తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మహా కూటమితో సిపిఐ కి ఒరిగేదేమీ లేదని ఆయన ఖరాఖండిగా చెప్పినట్లు తెలుస్తోంది. ఆయన ఇదే విషయమై వాదన చేసి సమావేశం నుంచి మధ్యలోనే బయటకు వెళ్లిపోయినట్లు పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
సిపిఐ ఒంటరిగా పోటీ చేస్తే బరిలోకి దిగాలనుకుంటున్న స్థానాలివే :
1 హుస్నాబాద్
2 ఆలేరు
3 మునుగోడు
4 కొత్తగూడెం
5 వైరా
6 పినపాక
7 బెల్లంపల్లి
8 మంచిర్యాల
9 దేవరకొండ
10 మల్కాజ్ గిరి
11 మహేశ్వరం
12 మేడ్చల్
13 సిద్ధిపేట
14 భద్రాచలం
15 చెన్నూరు
16 మహబూబాబాద్
17 మధిర
18 పాలేరు
19 నాగర్ కర్నూలు
20 మానకొండూర్
21 కుద్బుల్లాపూర్
22 తాండూర్
23 భూపాలపల్లి
24 నర్సంపేట
25 చేవెళ్ల
మహా కూటమిలో సిపిఐ కి మరీ మూడు సీట్లు మాత్రమే ఇస్తే కూటమి నుంచి వైదొలిగే అవకాశాలున్నట్లు పార్టీ నేతల నుంచి సమాచారం అందుతోంది. మరిన్ని అంశాలను సమావేశం ముగిసిన తర్వాత సిపిఐ నేతలు వెల్లడించారు.
వారి బాధ అది : వీరి బాధ ఇది…
సిిపిఐ లో మహా కూటమి చిచ్చు మామూలుగా రేగడంలేదు. పార్టీలో ఈ విషయంలో లీడర్లంతా రెండు వర్గాలుగా వేరయిపోయారు. గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన చాడా వెంకటరెడ్డి, కూనంనేని సాంభశిరావు, పల్లా వెంకటరెడ్డి లాంటి వారంతా కూటమిలో ఉండాలి తమకు సీటు రావాలన్న ధోరణితో ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లంతా సిపిఐ లో పాపులర్ లీడర్లుగా ఉన్నారు.
ఇక మిగతా సెక్షన్ కు వస్తే వారంతా ఫ్రెష్ లీడర్స్. వీరు తమ తమ నియోజవర్గాల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. మరి కూటమి కడితే ఇచ్చే మూడో, నాలుగో, ఐదో సీట్లలో తమకు పోటీ చేసే చాన్సే రాదని వారు వాదిస్తున్నారు. ఏదైతే అదైతది కూటమి లేకపోతే తమకు పోటీ చేసే అవకాశమైతే వస్తుంది.. గెలవడం, ఓడిపోవడం సెకండరీ అని వీరి వాదనగా ఉంది.
కానీ సీనియర్లుగా ఉన్న వారంతా కూటమి ఉండాలి. తమకు సీటు రావాలి. గెలవాలి అన్న పట్టుదలతో ఉన్నారు. వారిలో సీటు రాదనుకున్న సీనియర్లు మళ్ళీ కూటమిని వ్యతిరేకిస్తుండడం గమనార్హం.
అవసరమైతే ఒంటరి పోరు తప్పదు : సురవరం
సమావేశం అనంతరం సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అవగాహన లేకుండా నిర్ణయాలు తీసుకోలేమన్నారు. రెండు మూడు సీట్లు అంటే పార్టీ ఆత్మాహుతి స్థితికి నెట్టడమే అని తేల్చి చెప్పారు. ఆ స్థితి కి తీసుకురామని చెప్పారు. అలాంటి పరిస్థితి వస్తే ఒంటరి గా పోటీ చేస్తామని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు.
మీడియా సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ సీట్ల సర్దుబాటు విషయంలో తొందరగా తేల్చాలని డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. తాము 9 సీట్ లు అడిగినట్లు చెప్పారు. ఒకటో రెండో సీట్ లు తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని సంకేతాలు పంపారు. అంతకంటే తగ్గితే ఒప్పుకునేది లేదన్నారు. తాము ఇప్పటికీ మహాకూటమి తోనే ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాని వెల్లడించారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశం తరువాత కాంగ్రెస్ తో మరోసారి సంప్రదిస్తామన్నారు. సీట్ ల సర్దుబాటు వెంటనే కాంగ్రెస్ తేల్చాలని సూచించారు.
అయితే సమావేశం మధ్యలోనుంచే అలిగి వెళ్లిపోయినట్లు చెబుతున్న కూనంనేని సాంభశివరావు మీడియాతో మాట్లాడారు. తానేమీ మీటింగ్ నుంచి అలిగి వెళ్లలేదని వివరణ ఇచ్చారు.