మహా కూటమికి కటీఫ్ దిశగా సిపిఐ, ఈ 5 సీట్లలో పోటీ

తెలంగాణలో టిఆర్ఎస్ నిరంకుశ పాలన ఎండగట్టే లక్ష్యంతో కూటమి రాజకీయాలకు తెర లేపిన పార్టీ సిపిఐ. ఆ పార్టీ చొరవతో తెలంగాణలో మహా కూటమి ఆవిర్భవించింది. తొలుత తెలంగాణ జన సమితి, టిడిపి పార్టీలతో కూటమి ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో సిపిఐ అడుగులు వేసింది.కానీ సిపిఐ నెలకొల్పిన కూటమి ఇప్పుడు ప్రమాదంలో పడింది. 

కానీ ఆ కూటమిలోకి కాంగ్రెస్ వచ్చి చేరింది. వచ్చి చేరడమే కాదు కూటమి కట్టిన సిపిఐ ని లెక్క చేయకుండా కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నది. కాంగ్రెస్ తీరుపై తీవ్రమైన అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నది సిపిఐ. తాజా పరిణామాలు చూస్తే అసలు ఈ కూటమి కొనసాగుతుందా? లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. కూటమిలో తమకు గౌరవం లేదని సిపిఐ తన నిర్ణయం తాను తీసేసుకున్నది. మొన్నటికి మొన్న 9 సీట్లలో తాము పోటీ చేస్తామంటూ ఒక ప్రకటన జారీ చేసింది. ఆ సీట్లేవో కూడా వివరించింది. 

సిపిఐ ఒక అడుగు ముందుకేసినా కూడా కాంగ్రెస్ పార్టీలో చలనం రాలేదు. దీంతో శుక్రవారం జరిగిన సిపిఐ  కార్యవర్గ సమావేశంలో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ ఏ సీట్లు ఇస్తామన్నది తేల్చకుండా, ఎన్ని సీట్లు ఇస్తామన్నది తేల్చకుండా తాత్సారం చేయడం వల్ల తమకు ఆమోదం కాదని తేల్చింది. ఇక  కాంగ్రెస్ తేల్చదేమో అన్న ఉద్దేశంతో సిపిఐ పోటీ చేయబోతున్న స్థానాలను ప్రకటించింది.

కూటమి ఉన్నా లేకపోయినా తాము ఐదు సీట్లలో పోటీ చేస్తామని సిపిఐ నాయకత్వం ప్రకటించింది. ఆ పోటీ చేయనున్న స్థానాల జాబితా కింద ఉంది.

1 మునుగోడు,

2 వైరా

3 బెల్లంపల్లి

4 హుస్నాబాద్, 

5 కొత్తగూడెం

పై సీట్లలో పోటీ చేయడం ఖాయమని సిపిై రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే తాము అల్టిమేటం ఇచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ స్పందించకపోవడం సిపిఐ ని కలవరపెట్టింది. దీంతో శుక్రవారం కూడా సిపిఐ చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసింది. తుదకు టిడిపి, తెలంగాణ జన సమితితోనూ సంప్రదింపులు జరిపింది. ఆ పార్టీల ద్వారా కూడా కాంగ్రెస్ మీద వత్తిడి తెచ్చే ప్రయత్నం చేసింది. 

సిపిఐ వత్తిడి విషయమై తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం కూడా స్పందించారు. సిపిఐ తో సీట్ల సర్దుబాటు విషయాన్ని తేల్చాలని, సిపిఐ కూటమి నుంచి వైదొలిగితే నష్టమే తప్ప లాభం లేదని ఆయన కాంగ్రెస్ పార్టీకి సూచించారు. ఇది అంతిమంగా నింకుశ పాలన కొనసాగించిన టిఆర్ఎస్ కు లాభం చేకూరుతుందని అన్నారు. అయితే అన్ని వైపుల నుంచి సిపిఐ చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో 5 సీట్లకు పోటీ చేయనున్నట్లు ప్రకటించింది.   

మూడు సీట్ల కేటాయింపుపై సిపిఐ గుస్సా

సిపిఐ కి మూడు సీట్లు కేటాయిస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అయితే ఆ మూడు సీట్లను కూడా అడిగిన సీట్లు కాకుండా అడగని సీట్లు ఇస్తామనడాన్ని సిపిఐ జీర్ణించుకోలేకపోతున్నది. మరొక్క సీటు పెంచితే తమకు సమ్మతమే అని సిపిఐ వాదించినా ఇప్పటి వరకు కాంగ్రెస్ నుంచి క్లారిటీ రాలేదు. ఒకవైపు కాంగ్రెస్ తీరును జిల్లాల్లో పార్టీ నేతలంతా ఎండగడుతున్నారు. ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం సీటు ఇచ్చే ప్రశ్నే లేదని కాంగ్రెస్ చెప్పింది. ఈ సీటు విషయమే పొత్తుకు ప్రమాదం ఏర్పడిందని తెలుస్తోంది.

అయితే ఈ ఐదు సీట్లలో పోటీ చేస్తామని చెబుతూనే మరోవైపు కూటమి నుంచి తాము బయటకు వెళ్లిపోయే ప్రసక్తే లేదని చెబుతోంది. ఈ పరిణామాలు చూస్తుంటే సైతం మైండ్ గేమ్ ప్లే చేస్తున్నదా అన్న చర్చ కూడా ఉంది. మరి సిపిఐ రెండో సీట్ల ప్రకటనపై భాగస్వామ్య కూటమి పక్షాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి వెలువరించిన పత్రికా ప్రకటన కింద చూడొచ్చు.