క్రమశిక్షణకు మారుపేరుగా భావించే కమ్యూనిస్టు పార్టీలో నేతలు కట్టు తప్పుతున్నారా? నేతల ప్రవర్తనతో పార్టీ ప్రజల ముందు అపహాస్యం పాలవుతోందా.? నేతలను కట్టడి చేయడం పార్టీలకు సాధ్యమయ్యే పనేనా.. నేతలు మోనార్కులుగా వ్యవహరిస్తున్నారా అంటే పార్టీ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. సీపీఐ విషయంలో ఈ నేతలు మరీ స్వతంత్ర్యం వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. నిబంధనలు మాకేనా.. నేతలకు వర్తించవా అని ప్రశ్నించే కార్యకర్తలకు ఎలా సమాధానం చెప్పాలని తలలు పట్టకుంటున్నారు.రాజధాని రైతుల ఆందోళన విషయంలో చంద్రబాబు పన్నిన ఉచ్చులో నేతలు చిక్కుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. రాజధాని రైతుల ఆందోళనకు మద్దతు తెలపడం పార్టీ పరిధిలోని విషయమైనా.. వారు మరీ అతిగా ప్రవర్తిస్తున్నారని భావిస్తున్నారు. పార్టీ తీర్మాణాలను కూడా వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని పేర్కొంటున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలకు సమదూరం పాటించాలని ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో నిర్ణయించినా టీడీపీ నేత చంద్రబాబుతో చెట్టాపట్టాలేసుకొని తిరగడమేమిటని ప్రశ్నిస్తున్నారు.