చంద్రబాబుకు మరో షాకిచ్చిన కోర్టు… ఇక సెంట్రల్ జైల్లోనే!

టీడీపీ అధినేత చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో హౌస్‌ రిమాండ్‌ తదితర అంశాలతో చంద్రబాబు పిటిషన్లు వేశారు. తాజాగా వీటిపై వాదనలు ముగిశాయి. దీంతో ఈ హౌస్ రిమాండ్ పిటిషన్ పై కోర్టు తీర్పు వెలువడించింది. ఈ సందర్భంగా చంద్రబాబుకు షాకిచ్చింది.

చంద్రబాబు వయసు, అనారోగ్యం, భద్రత మొదలైన కారణాలు చూపిస్తూ వేసిన హౌస్‌ కస్టడీ పిటిషన్‌ పై విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది. ఇందులో భాగంగా… చంద్రబాబు తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన హౌస్‌ కస్టడీ పిటిషన్‌ ను న్యాయమూర్తి తిరస్కరించారు. ఈ సమయంలో చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉందని, జైల్లో పూర్తి స్థాయి భద్రత కల్పించామని ఏఏజీ సుధాకర్ రెడ్డి న్యాయస్థానానికి తెలిపారు.

చంద్రబాబు భద్రత గురించి ఎటువంటి ఆందోళనా అవసరం లేదని, జైల్లోనే కాకుండా జైలు పరిసర ప్రాంతాల్లో కూడా భద్రత కట్టుదిట్టం చేశామని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఏఏజీ. ఇదే క్రమంలో 24 గంటలూ పోలీసులు విధుల్లోనే ఉంటున్నారని, అత్యవసర పరిస్థితులు ఎదురైతే వైద్య సదుపాయం కూడా ఏర్పాటు చేశామని కోర్టుకు తెలిపారు! ముఖ్యంగా సాక్ష్యాలను ప్రభావం చేసే అవకాశం ఉండటం వల్ల చంద్రబాబు హౌస్‌ రిమాండ్‌ కు అనుమతించవద్దని న్యాయస్థానాన్ని విన్నవించారు.

మరోవైపు చంద్రబాబు తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా తమ వాదనలు వినిపించారు. చంద్రబాబుకు జైలులో ప్రమాదం పొంచి ఉందని, ప్రాణ హాని ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కరుడుగట్టిన నేరస్థులు, ఆయుధాలు వాడిన నేరస్థులు అదే జైల్లో ఉన్నారని కోర్టుకు తెలిపారు.

ఈ వాదనల అనంతరం ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి… చంద్రబాబు హౌస్‌ కస్టడీ పిటిషన్‌ ను తిరస్కరిస్తూ తీర్పు వెలువరించారు. దీంతో స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకు మరో బిగ్ షాక్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి!

కాగా… చంద్రబాబును తమకు ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ వేసిన పిటిషన్ కి సంబంధించి వాదనలను రేపటికి వాయిదా వేసింది న్యాయస్థానం. ఆ పిటిషన్ కు కోర్టు అంగీకరిస్తే… చంద్రబాబు ఐదురోజులపాటు ఏపీ సీఐడీ కస్టడీలో ఉండాల్సి వస్తుంది!