జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసుకు సంబంధించి హై కోర్టు కేంద్రానికే డెడ్ లైన్ విధించింది. హత్యాయత్నం కేసును కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎన్ఐఏ విచారణ చేయాలా వద్దా అన్న విషయమై ఈనెల 14వ తేదీలోగా నిర్ణయం తీసుకుని చెప్పాలంటూ కేంద్రాన్ని కోర్టు ఆదేశించటం గమనార్హం. హత్యాయత్నం కేసును రాష్ట్రప్రభుత్వ పరిధిలోని సిట్ విచారించేందు లేదని కోర్టు స్పష్టంగా తేల్చేసింది. మరి అదే సమయంలో ఎవరు విచారించాలి ? న్యాయంగా అయితే ఎన్ఐఏ విచారించాలి. లేకపోతే సిబిఐ కానీ అదీ కాకపోతే జ్యుడీషియల్ విచారణ అయినా జరగాలి. జగన్ అండ్ కో కూడా మొదటి నుండి అదే డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి పరిస్ధితుల్లో స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకుండా కోర్టు మధ్యే మార్గంగా వ్యవహరించటం ఆశ్చర్యంగా ఉంది.
మొత్తం మీద హత్యాయత్నం కేసులో చంద్రబాబానాయుడుకు కోర్టు పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పాలి. సిట్ ఆధ్వర్యంలో ఏదో తూతూమంత్రంగా విచారణ జరిపిస్తున్నట్లు లేకపోతే జరిపించినట్లు చేసి కేసును మూసేద్దామని అనుకున్నారు చంద్రబాబు. కానీ జగన్ పట్టుబట్టటంతో విషయం కోర్టుకెక్కింది. దాంతో కోర్టు అడ్వకేట్ జనరల్ కు బాగా తలంటింది. ఎయిర్ పోర్టు పరిధిలో జరిగిన ఘటనపై అసలు రాష్ట్రప్రభుత్వ విచారణ ఏమిటి ? రాష్ట్రప్రభుత్వం ఎలా జోక్యం చేసుకుంటుందని తీవ్రంగా ప్రశ్నించింది. కోర్టు ప్రశ్నలకు అడ్వకేట్ జనరల్ సమాధానం చెప్పలేకపోవటంతో రాష్ట్రప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించటంతో మండిపడింది. దాంతో ఏం చేయాలో రాష్ట్రప్రభుత్వానికి అర్ధం కాలేదు.
ఈ నేపధ్యంలోనే కేసు విచారణను సిట్ పరిధిలోనుండి తప్పించి ఎన్ఐఏకి బదిలీ చేయమని కోర్టు ఆదేశించింది. అయినా రాష్ట్రప్రభుత్వం బదిలీ చేయలేదు. దాంతో అడ్వకేట్ జనరల్ పై తీవ్రస్ధాయిలో విరుచుకుపడింది. ఎన్ఐఏకి బదిలీ చేయమని చెప్పినా ఎందుకు చేయలేదని నిలదీసింది. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘటనను ఎన్ఐఏకి బదిలీ చేయాల్సిన అవసరం లేదని అడ్వకేట్ జనరల్ చెప్పిన సమాధానంపై కోర్టు మండిపడింది.
కేసును రాష్ట్రప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నదా అంటూ సూటిగా ప్రశ్నించటం గమనార్హం. అందుకే అదే విషయాన్ని కోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. ఈ కేసు దర్యాప్తును ఎన్ఐఏ తో విచారణ చేయించే విషయంలో కేంద్రం 14వ తేదీలోగా నిర్ణయం తీసుకుని చెప్పాలంటూ ఆదేశించింది. మరి కేంద్రం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.