కేటిఆర్ రాజకీయ సన్యాసాన్ని ఒప్పుకోం : రేవంత్ రెడ్డి

కొడంగల్ వేదికగా రేవంత్ రెడ్డి కేసీఆర్ ఫ్యామిలీ పై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. వేలాది మందితో నామినేషన్ వేసిన రేవంత్ కేటీఆర్ మీద నిప్పులు చెరిగారు. కేటిఆర్ పై రేవంత్ రెడ్డి  తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ కేటిఆర్ కోసమే ముందస్తు ఎన్నికలకు పోయారన్నారు. తెలంగాణల దోచుకున్నది చాలక దేశం మొత్తాన్ని దోచుకోవాలని చూస్తున్నారన్నారు. అయ్యా కొడుకులు ఇద్దరు దోచుకోవాలని చూస్తున్నారని వారిని ఓటుతో తరిమి కొట్టాల్సింది ప్రజలేనన్నారు. కేటిఆర్ ను సీఎం చేసి కేసీఆర్ ప్రధాని కావాలని కలలు కంటున్నారని కేసీఆర్ తాత జేజమ్మ దిగి వచ్చినా అది నిజం కాదన్నారు.

ప్రభుత్వంలో ఉన్నప్పుడు 20 లక్షల కోట్ల పనులకు టెండర్లు పిలిచి పది శాతం చొప్పున కమీషన్లతో 20 వేల కోట్లు దోచుకున్నారని రేవంత్ విమర్శించారు. కేటిఆర్ దోచుకున్న పైసలతో దేశాన్ని వదిలి వెళ్లాలని చూస్తున్నారని పోలీసులు రెడ్ కార్నర్ నోటిసులు జారీ చేయాలని రేవంత్ సూచించారు. ఆయన రాష్ట్రాన్ని విడిచి పారి పోకుండా పాస్ పోర్టు స్వాధిన పరుచుకోవాలన్నారు.

కేటిఆర్ రాజకీయ సన్యాసం కాదు… తిన్నదంతా మిత్తితో సహా కట్టాలన్నారు. ఆయన రాజకీయ సన్యాసానికి ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు. అయ్యా కొడుకులిద్దరు నిజాం పాలనను గుర్తుకు తెచ్చారన్నారు. దొరల పాలనకు అంతమొందించాలని పిలుపునిచ్చారు.  

కొడంగల్ లో తనను ఓడించేందుకు అన్ని కుట్రలు పన్నుతున్నారని ఎన్ని కుట్రలు చేసినా అవన్ని కూలి పోవాల్సిందేనన్నారు. కొడంగల్ ప్రజలు పైసలకు లొంగే వారు కాదన్నారు. కేసీఆర్ పాలనలో కొడంగల్ కు చేసిందేమిటో చెప్పాలని ప్రశ్నించారు. నిధులు రాకుండా అడ్డుకొని నియోజకవర్గం పై కక్ష్య సాధించారన్నారు. అయినా కూడా కొడంగల్ ప్రజలు తనను గుండెలో పెట్టుకున్నారన్నారు. తాను చనిపోయే వరకు కొడంగల్ ప్రజలతో ఉంటానన్నారు. కేసీఆర్ 100 కోట్లు కాదు 1000 కోట్లు ఖర్చు పెట్టినా కొడంగల్ లో టిఆర్ఎస్ ను గెలిపించలేరన్నారు.

తన ప్రాణం ఉన్నంత వరకు కొడంగల్ ప్రజలకు సేవ చేస్తానని రేవంత్ ప్రకటించారు. రాబోయేది కాంగ్రెస్ సర్కారేనని అందులో కొడంగల్ కీలక పాత్ర పోషిస్తదన్నారు. కేసీఆర్ ముఠాలతో కొడంగల్ లో విద్వంసం చేయాలని చూస్తున్నారన్నారు. కొడంగల్ కు తాను హై టెన్షన్ వైరులా పని చేస్తానన్నారు. 

 హరీష్ తనని ముట్టుకొని చూడు మాడి మసై పోతావని రేవంత్ హెచ్చరించారు. పంటల మీద అడవి పందులను వేటాడినట్లు కొడంగల్ ప్రజలు టిఆర్ఎస్ ను తరుముతారన్నారు. కేటిఆర్ ను సీఎం చేయడానికే కేసీఆర్  ముందస్తు ఎన్నికలు తెచ్చాడని కేటిఆర్ ని సీఎం చేసి కేసీఆర్ తుది శ్వాస విడవాలనుకుంటున్నారన్నారు.

పిచ్చి కుక్కలన్నీ ఊర్ల మీద పడ్డట్టు టిఆర్ఎస్ కుక్కలు తనను ఓడించడానికి కొడంగల్ వెంట పడుతున్నాయని ఆ కుక్కలని ప్రజలు తరమాలన్నారు. తాను ఉద్వేగంగా నామినేషన్ వేశానన్నారు. తనను కేసులతో ఇబ్బందులు పెట్టినప్పుడు కొడంగల్ ప్రజలు తన కుటుంబానికి అండగా ఉన్నారని, తనకు అండగా నిలిచారని రేవంత్ ఉద్వేగంగా అన్నారు. ప్రతి ఒక్కరు తనను సొంత కుటుంబ సభ్యులలా ఆదరించారని ఏం ఇచ్చినా కొడంగల్ ప్రజల రుణం తీర్చుకోలేనన్నారు. ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడించి కాంగ్రెస్ ను అధికారంలోకి తేవాలని రేవంత్ పిలుపునిచ్చారు. 

రేవంత్ నామినేషన్ వేసిన వీడియోలు కింద ఉన్నాయి చూడండి.